యూపీ పోలీసుల నిర్లక్ష్యం…రేప్ బాధితురాలి తండ్రిని చంపిన నిందితుడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2020 / 03:15 PM IST
యూపీ పోలీసుల నిర్లక్ష్యం…రేప్ బాధితురాలి తండ్రిని చంపిన నిందితుడు

Updated On : February 12, 2020 / 3:15 PM IST

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. 

ఫిరోజాబాద్‌కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్‌మాన్‌ ఉపాధ్యాయ్‌ అనే వ్యక్తి గతేడాది ఆగస్టులో రేప్ కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడు పారిపోయాడు. అయితే ఇప్పటివరకూ పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో నిందితుడు ఉపాధ్యాయ్‌ వారం రోజుల క్రితం బాధితురాలి ఇంటికి వెళ్లి.. కేసు వెనక్కి తీసుక్కోవాలని వేధించడం మొదలుపెట్టాడు. ఐదు రోజుల్లోగా కేసు ఉపసంహరించకోకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరిని కచ్చితంగా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించి.. ఉపాధ్యాయ్‌ గురించి మరోసారి కంప్లెయింట్ చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. 

ఈ క్రమంలో సోమవారం(ఫిబ్రవరి-10,2020) బాధితురాలి తండ్రిని తుపాకీతో కాల్చి పరారయ్యాడు నిందితుడు ఉపాధ్యాయ్. ఈ ఘటనలో బాధితురాలి తండ్రి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ నిరసనలు వెల్లువెత్తడంతో… ఇద్దరు స్టేషను ఇంచార్జ్ లు సహా మరో అధికారిని సస్పెండ్‌ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

కాగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉన్నట్లు పలు రిపోర్ట్ లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక యూపీలో ఇటీవల ఉన్నావ్ లో జరిగిన ఉన్నావ్‌ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.