వరుస రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతి.. చిన్నారిని చిదిమేసిన లారీ

వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. నిత్యం చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

వరుస రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతి.. చిన్నారిని చిదిమేసిన లారీ

road accidents in telugu states and hyderabad today

Road Accidents in Telugu States: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న, క్షతగాతులవుతున్న సంఖ్య నానాటికీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, నిర్లక్ష్యం, నిబంధనలకు పాటించకపోవడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు వివరాలు..

ఆటో పల్టీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్ వద్ద మిరప కూలీల ఆటో పల్టీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిమ్మిర్యాల గ్రామానికి చెందిన కూలీలు ఎన్టీఆర్ జిల్లాలోని అనుమంచిపల్లి గ్రామానికి మిరప కూలీలకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బైకును ఢీకొట్టిన లారీ.. చిన్నారి మృతి
హైదరాబాద్ శివారు గండిపేట ఇబ్రహింబాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గర్భిణితో సహా ఇద్దరికి గాయాలు
హైదరాబాద్ శివారు తారామతి బారామతి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణితో సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టూ వీలర్ పైకి టిప్పర్ దూసుకెళ్లడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన మహిళకు మిస్ క్యారీ అయినట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Also Read: పార్శిల్‌తో ఉడాయించిన బైక్ రైడర్.. హైదరాబాద్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

ప్రగతినగర్ చెరువు వద్ద స్తంభాన్ని ఢీకొట్టిన కారు
కూకట్‌ప‌ల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు.. స్తంభానికి ఢీకొనడంతో ఒకరికి బలమైన గాయాలయ్యాయి. ప్రగతి నగర్ నుంచి జేఎన్టీయూ వైపు వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. గాయాలైన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అడ్డాడలో ప్రమాదం.. మహిళ మృతి
కృష్ణాజిల్లా పామర్రు మండలం అడ్డాడ వద్ద ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతురాలు పామర్రు మండలం పోలవరం గ్రామానికి చెందిన దేవరకొండ యశోదమ్మ (65)గా గుర్తించారు.

Also Read: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ప్రయాణికులను ఢీకొట్టిన రైలు.. 12 మంది దుర్మరణం!

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల బైపాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అనూహ్య ప్రమాదం.. ఒకరి మృతి
పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరులో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ.. కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. దీంతో కొబ్బరి చెట్టు విరిగిపోయి అక్కడే ఉన్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తిపై పడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

గుర్తుతెలియని రైలు ఢీకొని..
కొమురంభీం జిల్లా సిర్పూర్(టి) లోని గొల్లవాడ సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని భీమయ్య(51) అనే వ్యక్తి మృతి చెందాడు.