ఖరీదైన కారులో వచ్చారు, వీఐపీల్లా బిల్డప్ ఇచ్చారు.. కట్ చేస్తే బంగారు, వెండి ఆభరణాలు చోరీ…
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.
Robbery : వాలకం చూస్తే వీఐపీలు. అందుకు తగ్గట్లుగా ఫార్చునర్ కారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. అబ్బో వీళ్లు చాలా రిచ్ అయి ఉంటారు. అందుకే ఫార్చునర్ కారులో వెళ్తున్నారని భావిస్తారు. అది సహజం. కానీ ఈ ఖరీదైన కారు వెనక.. కాస్ట్‌లీ బట్టలు చాటున వీరు ఏం చేస్తున్నారో తెలుసా..?
గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఫార్చునర్ కారులో వచ్చి మరీ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. పొన్నూరులోని ధనలక్ష్మి జ్యువెలర్స్ షాపు షెటర్ తాళాలు పగులగొట్టారు. బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
అర్థరాత్రి అంతా పడుకున్నాక.. ఇద్దరు దుండగులు షెటర్ తాళాలు పగులకొట్టి లోపలికి చొరబడ్డారు. ఒకడు కౌంటర్‌లోని క్యాష్‌ను సర్దేశాడు. మరొకడు ర్యాకుల్లోని ఆభరాలను వరుస క్రమంలో సర్ది తీసుకెళ్లాడు. ఇంతలో మరో వ్యక్తి షాపులోకి వచ్చి సూచనలు చేశాడు. చివరకు ముగ్గురు పెద్ద మొత్తంలో ఆభరణాల పెట్టెలను దోచుకెళ్లారు.
అయితే బంగారు, వెండి ఆభరణాలు దోచుకొని ఉడాయించే క్రమంలో స్థానికులు గమనించారు. దొంగలు పారిపోతుండగా.. దోపిడీకి పాల్పడిన ముఠాలోని ఒకరిని పట్టుకొని ఎడాపెడా వాయించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
చోరీ జరిగిన విషయం తెలియడంతో యజమాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దొంగలు షాపులోని కొన్ని బంగారు ఆభరణాలు, 38 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు. చోరీకి గురైన బంగారం, వెండి విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని యజమాని వెల్లడించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు రాజస్థాన్ వాసులుగా అనుమానిస్తున్నారు. మరోవైపు గతంలో ఈ షాపునకు సమీపంలోని మరో బంగారు షాపులో భారీ చోరీ జరిగింది. తాజాగా ధనలక్ష్మి జ్యువెలర్స్‌లో దొంగతనం జరగడంతో బంగారు నగల వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఎలాంటి సర్టిఫికెట్ అయినా డబ్బులిస్తే చిటికెలో చేతిలో పెడతారు..! వెలుగులోకి నకిలీ సర్టిఫికెట్ల బాగోతం