ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో…వైట్‌హౌజ్ వద్ద కాల్పుల కలకలం

  • Published By: venkaiahnaidu ,Published On : August 11, 2020 / 07:11 PM IST
ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో…వైట్‌హౌజ్ వద్ద కాల్పుల కలకలం

Updated On : August 11, 2020 / 8:43 PM IST

అమెరికా అధ్యక్షుడు ‌ ట్రంప్‌ సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైట్‌హౌజ్‌ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగుడు వైట్ హౌస్ బయట కాల్పులకు తెగబడ్డాడు. వైట్‌హౌజ్‌ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్‌ ప్రెస్ ఈవెంట్‌ మధ్యలోనే ఆపివేసి తన కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు.

వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డ్స్‌… సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పరిస్థితి చక్కబడగానే మళ్లీ విలేకరుల ఎదుటకు వచ్చిన ట్రంప్‌.. వైట్‌హౌజ్‌ పరిసరాల్లో సంచరిస్తూ భద్రతకు భంగం కలిగించిన ఓ వ్యక్తిపై సీక్రెట్‌ సర్వీసెస్‌ గార్డ్స్‌ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. చట్టప్రకారమే సాయుధుడైన దుండగుడిపై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వాళ్లు అత్యద్భుతమైన వ్యక్తులు. వాళ్ల సేవల పట్ల సంతోషంగా ఉన్నాను. ఎంతో భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నాను అని సత్వరమే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డులపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఘటనపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ప్రపంచంలోని ప్రతీ మూల ఏదో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది కదా’ అని సమాధానమిచ్చారు.