శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా విషాదం : లారీ ఢీకొని ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
తుమ్మరలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి పలువురు తిరిగి వస్తున్నారు. నేలకొండపల్లి వెళ్లేందుకు కోదాడలో ప్రయాణికులను ప్యాసింజర్ ఆటోలో ఎక్కిస్తుండగా వేగంగా వస్తున్న లారీ..ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో కూర్చున్న ఐదుమంది అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అవసరమైతే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ తరలించాలని అధికారులను కోరారు.