తల్లిని, ఆమె ప్రియుడిని నరికి చంపిన కొడుకు

  • Published By: vamsi ,Published On : May 9, 2019 / 03:26 PM IST
తల్లిని, ఆమె ప్రియుడిని నరికి చంపిన కొడుకు

Updated On : May 9, 2019 / 3:26 PM IST

ఎంత చెప్పినా కూడా తన మాట వినలేదని కన్న తల్లినే నరికి చంపేశాడు కొడుకు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామంలో ఈ ఘటన వెలుగుజూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన 49 ఏళ్ల బడేసాబ్, గుండ్రేవులు గ్రామానికి చెందిన 42 ఏళ్ల శంకరమ్మ బంధువులు అవుతారు. శంకరమ్మ భర్త చనిపోయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. అయితే వీరిద్దరి మధ్య సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు రాముడు తల్లిని తప్పు అంటూ హెచ్చరించాడు. కొడుకు హెచ్చరించిన పద్దతి మార్చుకోని తల్లి  బడేసాబ్‌తో కలిసి తిరుగుతున్నది. ఎంత చెప్పినా పట్టించుకోకుండా బడేసాబ్‌తో కలిసి తిరుగుతున్న తల్లిని చంపేయాలని రాముడు ఫిక్స్ అయ్యాడు.

రాజోలికి ఆటోలో తిరిగి వస్తున్న తల్లిని చంపేందుకు బైక్‌ మీద బయలుదేరాడు రాముడు. రాజోలి గ్రామశివారులోకి రాగానే ఆటోలో నుంచి ఇద్దరినీ దింపి, పదునైన ఆయుధంతో దాడి చేశాడు. గొంతు, తలపై కత్తితో నరికాడు. ఈ దాడిలో బడేసాబ్, శంకరమ్మ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డుమీదే శవాలు పడి ఉన్నా, ఎవ్వరూ పోలీసులకు చెప్పలేదు. హత్య జరిగిన చాలా సమయం వరకూ పోలీసులకు విషయం తెలియలేదు. సాయంత్రం సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాల వద్ద లభించిన సెల్‌ఫోన్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బడేసాబ్ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అప్పటికే కర్నూలు జిల్లా బెలగల్ పోలీస్ స్టేషన్‌లో రాముడు లొంగిపోయాడు.