డేటింగ్ యాప్ యమ డేంజర్… టెక్కీ నుంచి రూ.16లక్షలు స్వాహా చేసిన యువతులు

డేటింగ్ యాప్ యమ డేంజర్… టెక్కీ నుంచి రూ.16లక్షలు స్వాహా చేసిన యువతులు

Updated On : December 18, 2020 / 7:29 PM IST

Techie loses Rs.16 Lakh to Blackmailers on dating app : డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతులు బెంగుళూరు కు చెందిన ఒక టెకీ నుంచి 10 రోజుల్లో రూ.16లక్షలు దోచేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ఫ్రకారం… బెంగుళూరు కు చెందిన టెకీ కి డిసెంబర్ 2వ తేదీన ఒక డేటింగ్ యాప్ లో శ్వేత అనే యువతి పరిచయం అయ్యింది. తనకు రెండువేల రూపాయలు కావాలని ఆమె టెకీని కోరింది. అందుకు సమ్మతించాడు ఆ వ్యక్తి. డిజిటల్ విధానంలో పేమెంట్ చేసేందుకు ఆమె తన స్నేహితురాలు నిఖిత నెంబరు టెకీకి ఇచ్చింది.

కొద్దిసేపటి తర్వాత నిఖిత టెకీకి ఫోన్ చేసింది. అందులో ఆమె అతడితో నగ్నంగా ఉండి మాట్లాడింది. ఈ వీడియో కాల్ ను నిఖిత రికార్డ్ చేసింది. అనంతరం ఆ వీడియోను అడ్డం పెట్టుకుని అతడిని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించింది. ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు ప్రీతి అగర్వాల్, షెరైన్ లు తాము అడిగినంత డబ్బుచెల్లించకపోతే నిఖిత నగ్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించ సాగారు. ఇలా అతడి వద్దనుంచి డిసెంబర్ 3-13 మధ్య 10 రోజుల్లో, ఆన్ లైన్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 16 లక్షల రూపాయలు దోచేశారు.

దీంతో విసిగెత్తిపోయిన ఆ టెకీ డిసెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాళ్లపై ఐపీసీ సెక్షన్ 419, 420ల కింద, ఐటీ యాక్ట్ కింద సెక్షన్ 66(సి)66(డి)ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బెంగుళూరులో  డేటింగ్ యాప్ ద్వారా పురుషులను మోసం చేసిన యువతుల కేసులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో బెంగుళూరు వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో ఇలాంటి 5 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 39 ఏళ్ల పోలీసు ఇనస్ పెక్టర్ కూడా ఒక బాధితుడవటం కొసమెరుపు.