Tragedy : కృష్ణాజిల్లాలో విషాదం… విగతజీవులుగా చిన్నారులు

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తప్పి పోయిన ముగ్గరు చిన్నారులు మృతదేహాలై తేలారు.

Tragedy : కృష్ణాజిల్లాలో విషాదం… విగతజీవులుగా చిన్నారులు

Tragedy Krishna District

Updated On : June 22, 2021 / 6:57 PM IST

Tragedy : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తప్పి పోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులై తేలారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం, సగర్లపేటకు చెందిన ముగ్గురు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా  సోమవారం ఆదృశ్యమయ్యారు. ఖగ్గా దుర్గా జ్యోతి అనే మహిళ తన పిల్లలు ఖగ్గ శశాంక్(11)చంద్రిక(9) పక్కింటి అబ్బాయి కోట్ల జగదీష్(8) ముగ్గురు కలిసి ఆడుకుంటుండగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లలను గాలించటానికి  5 బృందాలను ఏర్పాటు చేశారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. చివరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలను  ఈరోజు  ఈదర గ్రామ సమీపంలోని చెరువులో కనుగొన్నారు. ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి చనిపోయారా?  ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈదర గ్రామంలో నివసించే ఖగ్గా మురళి, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గత రెండేళ్లుగా భార్యా భర్తల మధ్య కుటుంబ కలహాలతో మనస్పర్దలు వచ్చి విడిగా కాపురం ఉంటున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం ఇంటిముందు ఆడుకుంటున్న పిల్లలు కనపడక పోతే,  భర్తే తన పిల్లలను ఎక్కడో చుట్టాల  ఇంట్లో దాచి ఉంటాడనే అనుమానంతో జ్యోతి  పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో  భాగంగా విజయవాడలో ఉంటున్న మురళిని అదుపులోకి తీసుకుని  ప్రశ్నించారు. మరికొన్ని బృందాలు పిల్లల కోసం  గాలింపు చేపట్టాయి. ఈరోజు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు శోభనాపురం  చెరువులో శవాలై తేలటం స్ధానికంగా కలకలం రేపింది.  పోలీసులు  చిన్నారుల మృతికి గల కారణాలను చేధించే పనిలో నిమగ్నమయ్యారు. స్ధానికంగా ఉన్నసీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని నూజివీడు డీఎస్పీ బి. శ్రీనివాసులు తెలిపారు.