Andhra Pradesh : కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.

Andhra Pradesh : కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

Anantapur Current Shock

Updated On : July 17, 2022 / 7:42 PM IST

Andhra Pradesh :  అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  కరెంట్ షాకుతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.  జిల్లాలోని కణేకల్ మండలం ఉడేగోళం గ్రామానికి చెందిన రమేష్(33), దేవేంద్ర(26), వన్నూరు స్వామి ముగ్గురు అన్నదమ్ములు. ఈరోజు మధ్యాహ్నం వారు ముగ్గురూ పొలానికి వెళ్లారు. పొలంలో నాట్లకు నీళ్లు పెట్టేందు కోసం మోటర్ వద్దకు వెళ్లారు. స్టార్టర్ మోటర్ పని చేయకపోవడంతో మరమ్మత్తులు చేసే క్రమంలో ముగ్గురు అన్నదమ్ములు కూడా విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు.

ముందుగా రమేష్ విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. రక్షించబోయిన దేవేంద్ర సైతం మృత్యువాత పడ్డాడు. అతని రక్షించేందుకు వెళ్లిన మూడవ తమ్ముడు వన్నూరు స్వామి స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రమేష్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు, దేవేంద్రకు భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన గ్రామస్తుల హృదయాలను కలిచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Viral Video : గుర్రంపై కుక్కపిల్ల స్వారీ