CBSE Board Exam 2024 : రైతుల నిరసన మధ్య 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షలు.. విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక సూచనలివే..!

CBSE Board Exams Guidlines : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు గురువారం (ఫిబ్రవరి 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు కీలక సూచనలు చేసింది.

CBSE Board Exam 2024 : రైతుల నిరసన మధ్య 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షలు.. విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక సూచనలివే..!

CBSE issues advisory for students appearing for Class 10, 12 board exams

CBSE Board Exam Guidelines : రైతుల ఢిల్లీ చలో నిరసనల మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 (ఈరోజు) నుంచి సీబీఎస్ఈ బోర్డు 2014 పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల నేపథ్యంలో సీబీఎస్ఈ విద్యార్థుల కోసం కొన్ని కీలక సూచనలు చేసింది.

Read Also : IAS Poorna Sundari : ఐఏఎస్ పూర్ణ సుందరి సక్సెస్ స్టోరీ : కంటిచూపు లేకున్నా ఆడియో క్లాసులు విని.. ఐఏఎస్ కలను సాధించింది!

ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, పాఠశాలలు, తల్లిదండ్రులకు అడ్వైజరీని సీబీఎస్ఈ జారీ చేసింది. విద్యార్థులు పరీక్ష హాలుకు తొందరగా చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సీబీఎస్ఈ కోరింది. ఈ సంవత్సరం భారత్ సహా 26 దేశాల నుంచి సీబీఎస్ఈ పరీక్షలకు 39 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఢిల్లీలోని 877 పరీక్షా కేంద్రాల్లో బోర్డు పరీక్షలకు 5,80,192 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

మెట్రో సేవలను వినియోగించుకోవాలి :
షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 10:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులందరూ ఉదయం 10 గంటల కన్నా ముందే (కనీసం 30 నిమిషాల ముందు) తమ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సీబీఎస్ఈ సూచించింది.
ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఆలస్యం కావచ్చునని తెలిపింది. అందుకే పరీక్షా కేంద్రాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రో సేవలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సీబీఎస్ఈ సూచించింది.

ఉదయం 10 గంటల తర్వాత అనుమతి ఉండదు :
సీబీఎస్ఈ విద్యార్థులందరూ స్థానిక పరిస్థితులు, ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులు, దూరం మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సీబీఎస్ఈ కోరింది. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 10 గంటలకు ప్రవేశించిన విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని వెల్లడించింది. 10 గంటల తరువాత విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. అంతేకాదు.. విద్యార్థులు తప్పనిసరిగా సీబీఎస్ఈ అడ్మిట్ కార్డును పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదంటే పరీక్ష హాల్లోకి అనుమతించరు.

సీబీఎస్ఈ పరీక్షల సమయాలివే :
సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతాయి. కొన్ని పరీక్షలు మాత్రం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు 10వ తరగతి పరీక్షలు, 2024 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..