కోరుకున్న చోట సర్టిఫికెట్ల వెరిఫికేషన్

విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ పలు నిర్ణయాలు తీసుకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరే స్టూడెంట్స్ సర్టిఫికెట్ల విషయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థి తమ ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్ లైన్ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులుండకుండా..అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకొనేలా చర్యలు చేపట్టింది. మే 10వ తేదీ శుక్రవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగింది.
ఇందుకు అవసరమైన స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకరావాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని అన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతి గంటను స్లాట్‌గా విభజిస్తారు. ఫీజు చెల్లించిన వెంటనే స్లాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవాలి. విద్యార్థి ఆన్ లైన్‌లో పేర్కొనే హెల్ప్ లైన్ కేంద్రాన్ని, సమయాన్ని ఎంచుకోవాలి. అలా స్లాట్ బుక్ చేసుకున్న స్టూడెంట్ సంబంధిత హెల్ప్ లైన్ సెంటర్‌కు నిర్ణీత సమయంలో వెళ్లి తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.