కొలువుల జాతర: గురుకులాల్లో 4 వేల 322 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయె విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 4,322 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాబోయే 4 ఏళ్లలో దశలవారీగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. వీటిలో రెసిడెన్షియల్ స్కూళ్లలో పని చేసేందుకు టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి 3,689 పోస్టుల భర్తీకి సోమవారం (జనవరి 29,2019) ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, గురుకుల సొసైటీలో పని చేసేందుకు మరో 28 రెగ్యులర్, 10 ఔట్ సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్‌తోపాటు బీసీ గురుకులాల్లోని వివిధ కేటగిరీల్లో 595 ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిని వచ్చే (2019-20) విద్యా సంవత్సరంలోనే భర్తీ చేయనున్నారు. అలాగే 1,071 టీజీటీ రెగ్యులర్ సహా 1,904 పోస్టులను 2019-20 లో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతిచ్చింది. వీటికి (TREIRB) నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. 595 ఔట్ సోర్సింగ్ పోస్టులను బీసీ గురుకుల సొసైటీ భర్తీ చేయనుంది. వీటిలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు 238 పోస్టులు, ల్యాబ్ అటెండర్లు- 238, ఆఫీస్ సబార్డినేట్ 119 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు బీసీ రెసిడెన్షియల్ సొసైటీలో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ పోస్టులు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 4 భర్తీ చేయనున్నారు.
మరోవైపు భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1,948 ఖాళీలు భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీచేయనుంది. ఇందులో 137 గ్రూప్-1, 339 గ్రూప్-3 ఉద్యోగాలున్నాయని టీఎస్‌పీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.