పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు

గాంధీ, ఉస్మానియాల్లో  పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య..గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చేరిన వారు 104 మంది

  • Published By: chvmurthy ,Published On : January 8, 2019 / 04:25 AM IST
పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు

గాంధీ, ఉస్మానియాల్లో  పెరుగుతున్న స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య..గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చేరిన వారు 104 మంది

హైదరాబాద్ : రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా చలితీవ్రత పెరగటంతో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. లేటెస్ట్ గా ఈవ్యాధి లక్షణాలతో, ఎన్‌1హెచ్‌1 వైరస్‌ కలిగిన ముగ్గురు వ్యక్తులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరిలో సిద్దిపేటకు చెందిన వ్యక్తి,ఉప్పల్‌లో నివసించే యువతి, ఆల్వాల్‌కు చెందిన మరొకరు ఉన్నారు. ముగ్గురికీ  వైరస్‌ సోకినట్లు వైద్యలు నిర్ధారించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఇప్పటికే  మరో ఇద్దరు ఈ లక్షణాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  
చలి తీవ్రంగా ఉండే అక్టోబరు నుంచి ఫిబ్రవరి నెలల్లో బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. గతేడాది అక్టోబరులో 30 మంది, నవంబరులో 19, డిసెంబరులో 18 మంది స్వైన్‌ఫ్లూ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చేరగా, వీరిలో 18 మంది  మరణించారు.  మరణించినవారిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్ప్రత్రుల నుంచి చివరి నిమిషంలో గాంధీలో చేరిన వారేనని వైద్యులు  తెలిపారు. కాగా ఉస్మానియా ఆస్పత్రి లో గత డిసెంబరు వరకు 11 మంది ఇవే లక్షణాలతో చనిపోయారు. ఎన్‌1హెచ్‌1 వైరస్‌ చలి పెరిగిన సమయంలో విస్తరిస్తుందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న  వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  ప్రజలు స్వైన్ ఫ్లూ లక్షణాలు గమనించిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రులకువెళ్లి  నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.గత ఏడాది కాలంగా హైదరాబాద్ లోని గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో 104 మంది చేరగా వారిలో 29 మంది మరణించారు. మిగిలిన వారుచికిత్స పొంది కోలుకున్నారు.