Mouth Ulcers: నోట్లో పుండ్లు ఇబ్బందిపెడుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
నోట్లో పుండ్ల సమస్యకు కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.

Mouth Ulcers Tips
నోట్లో పుండ్లు.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ సమస్య బాధపడుతున్నారు. వీటినే మౌత్ అల్సర్, వేడి గుల్లలు, పొక్కులు అని కూడా పిలుస్తారు. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు, కారం, మసాలాలను ఎక్కువగా తీసుకున్నా, పలు రకాల మెడిసిన్ల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగా నోట్లో పుండ్లు రెండు మూడు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, అప్పటివరకూ ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. ఆ సమయంలో ఆహారం తినడం, నీళ్లు తాగడం, కనీసం మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే.. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల నొప్పి, మంట నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. మరి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నోట్లో పుండ్ల సమస్యకు కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను, ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దూది మొక్కతో, లేదా వేలితో పుండ్లు ఉన్నచోట కాస్త కొబ్బరినూనెను రాస్తే నొప్పి, మంటను తగ్గిస్తుంది. అది కూడా రాత్రి పూట చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పుండ్లు త్వరగా మానిపోతాయి. అంతేకాకుండా.. తేనెలో సహజసిద్ధమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి పుండ్లను తగ్గించడంలో మెరుగ్గా సహాయం చేస్తాయి. కొద్దిగా తేనెను తీసుకుని నేరుగా పుండ్లపై రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జులో కూడా యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఈ కలబంద గుజ్జును నేరుగా పుండ్లపై రాయడం వల్ల ఫలితం ఉంటుంది. పుండ్లు త్వరగా మానిపోతాయి. ఇంకా బేకింగ్ సోడా, నీరు మిశ్రమం నోట్లో ఉండే ఆమ్లాలను తొలగిస్తుంది. దీంతో నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం వంటల్లో వాడే పసుపులో కర్‌క్యుమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్ సమ్మేళనంగా పనిచేస్తాయి. కాబట్టి.. పసుపును నీళ్లతో కలిపి పేస్ట్ లా చేసి పుండ్లపై పెడితే త్వరగా మానిపోతాయి. ఇలా రోజుకు 3 సార్లు ఇలా చేస్తుంటే నోట్లోని పుండ్లు మానిపోతాయి.