టెంపర్ దిగిందా : కడప జైలుకు బండ్ల గణేశ్

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. చెక్ బౌన్స్ కేసులో అరెస్టు అయిన అతణ్ని కడప జైలుకు తరలించారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు బండ్ల గణేష్‌ను గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కడపకు తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి.
2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి నుంచి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు గణేశ్. తిరిగి చెల్లించలేదు. నోటీసులు పంపించినా స్పందించలేదు. గట్టిగా నిలదీస్తే బ్యాంక్ చెక్కులు ఇచ్చాడు. వాటిని బ్యాంక్ వేస్తే బౌన్స్ అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు అయ్యింది. కోర్టు విచారణకు రావాలని ఆదేశించింది. సరైన కాలంలో హాజరు కాకపోవడంతో బండ్ల గణేష్‌పై కోర్టు సెప్టెంబర్ 18న అరెస్ట్ వారంట్ ఇష్యూ చేసింది.
అక్టోబరు 5న బండ్ల గణేష్ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడటంతో హైదరాబాద్‌లోనూ అతనిపై కేసు నమోదైంది. గణేశ్ తన అనుచరులతో కలిసి ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఇంటిపైకి దౌర్జన్యానికి యత్నించాడు. ఈ కేసులో పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ను కడప జైలుకు తరలించారు.