ఆపద అంటే వచ్చేస్తాం: వందకు ఫోన్ చేసిన ఎనిమిది నిమిషాల్లోనే

  • Published By: vamsi ,Published On : December 13, 2019 / 01:05 PM IST
ఆపద అంటే వచ్చేస్తాం: వందకు ఫోన్ చేసిన ఎనిమిది నిమిషాల్లోనే

Updated On : December 13, 2019 / 1:05 PM IST

ఆపద అంటే వచ్చేస్తాం అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. దిశ ఘటన తర్వాత అలర్ట్ అయిన పోలీసులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపదలో ఉంటే వెంటనే పోలీసుల సాయం కోరాలని అవగాహన పెంచుతున్నారు. ఈ మేరకు 100 నెంబర్‌కు ఫోన్‌ చేసిన 8 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటారని నగర కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు.

పెట్రోలింగ్‌ వాహన సిబ్బంది పనితీరుపై నిజాం కాంలేజీ గ్రౌండ్స్‌లో సమీక్షలు నిర్వహించిన ఆయన నగర వాసుల రక్షణ కోసం ఎల్లవేళలా పోలీసులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటే పోలీసులు తక్షణం స్పందిస్తారని అన్నారు. ప్రజాసేవ, ప్రజల భద్రత కోసమే పోలీసులు ఉన్నారని అన్నారు.

నగరంలోని కోటి మంది ప్రజలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని కమిషనర్‌ స్పష్టంచేశారు. పోలీసుశాఖలో పలు సంస్కరణలతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నూతన సంవవత్సరంలో మరిన్ని సేవలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.