రెండోసారి కరోనా, అయినా భయపడాల్సిన పని లేదు, యాంటీబాడీస్ లేకున్నా ఆందోళన వద్దు, CCMB డైరెక్టర్

ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక హమ్మయ్య బతికిపోయాం అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అలాంటిది రెండోసారి కరోనా వస్తే? ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ రెండోసారి కరోనా సోకే చాన్సులు లేకపోలేదు. ఇటీవలి కాలంలో అలాంటి కేసులు కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాగా, రెండోసారి కరోనా వస్తే ప్రాణాలకు ప్రమాదమా? రెండోసారి అటాక్ అయితే అసలేం జరుగుతుంది? దాన్ని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడీ సందేహాలు అందరినీ పీడిస్తున్నాయి. వీటికి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సమాధానం ఇచ్చారు. రెండోసారి కరోనా వచ్చిన భయపడాల్సిన పని లేదని ఆయన అంటున్నారు.
యాంటీబాడీస్ స్వల్పకాలమే ఉంటున్నాయా:
ఓసారి వచ్చి తగ్గాక మళ్లీ కరోనా వచ్చే అవకాశం లేదని ఇన్నాళ్లు భావిస్తూ వస్తున్నాం. రెండోసారి వైరస్ దాడిచేస్తే రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమై అప్పటికే తయరై ఉన్న యాంటీబాడీస్‌తో అడ్డుకుంటుందన్న భావన ఉంది. అయితే, యాంటీబాడీస్ స్వల్పకాలమే ఉంటున్నాయనే తాజా అధ్యయనాలతో ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడారు. రెండోసారి కరోనా భయం అవసరం లేదని స్పష్టం చేశారు.
రెండోసారి కరోనా బారిన పడటానికి కారణాలు ఇవే:
‘‘అక్కడక్కడ ఒకరిద్దరు రెండోసారి కొవిడ్ బారిన పడ్డారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికిప్పుడు దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ అనుమానాస్పద కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. లక్షల మందిలో నలుగురైదుగురు మాత్రమే రెండోసారి కొవిడ్ బారిన పడటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. రెండోసారి వచ్చిందని నిర్ధారించేందుకు చాలా విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శాంపిల్స్ మారిపోయి పరీక్ష ఫలితాల్లోనూ తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.
ఆయా వ్యక్తుల్లో మొదటిసారి యాంటీబాడీస్ ఉత్పత్తి కాకపోవడం, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలూ కారణాలై ఉండొచ్చు. వైరస్ రకాల్లో మార్పులున్నప్పుడూ రోగనిరోధక వ్యవస్థ గుర్తించకపోయే అవకాశం ఉంది. మన దేశంలో, హైదరాబాద్‌లో వ్యాపించిన వైరస్ ఉత్పరివర్తనాల్లో అనూహ్యమైన మార్పులేమి ఇప్పటివరకు కనిపించ లేదు” అని మిశ్రా అన్నారు.
అంటువ్యాధులను శరీరం గుర్తుంచుకుంటుంది:
‘కొవిడ్-19 వైరస్ సోకి తగ్గిన తర్వాత ఎక్కువ రోజులు యాంటీబాడీస్ ఉండటం లేదనే ఆందోళన అవసరం లేదు. యాంటీబాడీస్ లేకపోతే వైరస్ నుంచి ఇక రక్షణ లేదనీ భావించనక్కర్లేదు. మన శరీరంలోని వ్యవస్థ గతంలో సోకిన అంటువ్యాధులను గుర్తుంచుకోగలదు. తొలిసారైతే గ్రహించడానికి కొంత సమయం పడుతుంది. మొదట సహజ రోగనిరోధక సైన్యాన్ని వైరస్‌పై దాడికి పంపుతుంది. తర్వాత బి-లింఫోసైట్ దళాలు వైరస్ చెంతకు చేరుకుని ప్లాస్మా కణాలను తయారు చేయడం ప్రారంభిస్తాయి. అవి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియకు ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది.
మళ్లీ వైరస్ సోకితే శరీరం వెంటనే స్పందిస్తుంది:
మళ్లీ వైరస్ సోకితే మాత్రం శరీరం వెంటనే స్పందిస్తుంది. బలమైన దాడిని ప్రారంభిస్తుంది. అప్పటికే యాంటీబాడీస్ మాయమైనప్పటికీ మెమొరీలో బి-లింఫోసైట్లు ఉంటాయి. ఇవి ఏళ్ల తరబడి మన శరీరంలో మనగలుగుతాయి. వైరస్ సోకగానే తక్షణం గుర్తించి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా అడ్డుకుంటాయి. ఇలాంటి చాలా రక్షణ వ్యవస్థలుంటాయి. గత అనుభవాలు ఇవే చెబుతున్నాయి. కొవిడ్‌కు సంబంధించి వీటిపై అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని రాకేశ్ మిశ్రా అన్నారు.
కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్:
భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారి కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో ఏ దేశంలోనూ నమోదు కానన్ని కేసులో ఇండియాలో బయటపడ్డాయి. గత 24గంటల్లో మన దేశంలో 83వేల 883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒకేరోజులో 80వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకాలేదు. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 38లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 67వేలు క్రాస్ అయ్యింది.