ఈవీఎం లను హ్యాక్ చేయలేరు : సీఈవో రజత్ కుమార్

హైదరాబాద్: ఈవీఎం లను ఎవరూ హ్యాక్ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ‘లోక్‌సభ జనరల్ ఎలక్షన్స్– మీడియా మానిటరింగ్ అండ్ మీడియా మేనేజ్‌మెంట్’ అనే అంశంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ …ఈసీ నిబంధనల ప్రకారంగా ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి అంశాలకే యంత్రాంగం పరిమితమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈసీ నియమించే ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ పరిధిలోకి రారని, నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికే వారు వారు నివేదికలు అందజేస్తారని తెలిపారు.
ఎన్నికల సమయంలో మీడియా అనుసరించాల్సిన పద్ధతుల గురించి జిల్లా ఎన్నికల అధికారులు దానకిషోర్(హైదరాబాద్), రోనాల్డ్‌రాస్(మహబూబ్‌నగర్), డీఎస్ లోకేష్‌కుమార్(రంగారెడ్డి), అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్ సీఈవోలు ఆమ్రపాలి, రవికిరణ్, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి వివరించారు. వీవీప్యాట్ స్లిప్పులను ఐదేళ్లపాటు భద్రపరిచే పద్ధతి ఉందని మహబూబ్‌నగర్ డీఈవో రోనాల్డ్ రాస్ చెప్పారు.
ఈవీఎంల సాంకేతికత, వాటి పనితీరు, భద్రతా ప్రమాణాల అంశాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోక్‌సభ ఎన్నికలకు కొత్తగా వచ్చే ఎం3 ఈవీఎంలు సాంకేతికంగా పటిష్టంగా ఉన్నాయని రోనాల్డ్ రాస్ తెలిపారు. పోలింగ్ రోజున క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే సదుపాయం కల్పించే క్రమంలో అర్ధరాత్రి 12 దాటితే ఎం3 ఈవీఎం క్లోజింగ్ బటన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని, దీనిపై ఈసీ బహిరంగ సవాల్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.