జలకళ : తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు జల ప్రవాహం

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 07:43 AM IST
జలకళ : తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు జల ప్రవాహం

Updated On : September 19, 2019 / 7:43 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రస్తుతం నీటి ప్రవాహం 23.9 అడుగులకు చేరుకుంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున రెండు నుంచి మూడు అడుగుల మేర నీటిమట్టం పెరిగే అవకాశమున్నట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ , మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండడంతో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 79వేల 343 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలు భారీగా పెరిగాయి. నాగార్జునసాగర్‌ నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్రకు వరద స్వల్పంగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకూ వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ఇన్‌ఫ్లో లక్షా 24వేల క్యూసెక్కులుండగా… అవుట్‌ఫ్లో లక్షా 18వేల 34 క్యూసెక్కులు. తొమ్మిదిగేట్ల ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు

తుంగభద్రకు వరద స్థిరంగా కొనసాగుతోంది. కర్నాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు స్థిరంగా వరద వస్తోంది.  ప్రస్తుతం తుంగభద్రకు 21వేల 279 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా… 21వేల 63 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.  1,633 అడుగుల నీటి మట్టానికి గాను 1,633 అడుగుల నీటిని నిల్వ చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం లక్షా 26వేల 657 క్యూసెక్కుల వరద వస్తోంది.  జూరాల నుంచి 70వేల 113 క్యూసెక్కులు, పవర్‌హౌజ్‌ నుంచి మరో 43వేల 107 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 13వేల 437 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 78వేల 540 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 
శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌కు వరద వస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 70వేల 456 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయికి నీరు చేరడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
Read More : రాయలసీమలో భారీ వర్షాలు : కందూ నది ఉగ్రరూపం