జాగ్రత్త : 3 రోజులు బయటికి రాకపోవడమే మంచిది

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరగనుంది. సోమవారం (మే 6,2019) నుంచి మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఎండలో తిరగాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకపోవడం బెటర్ అని చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం (మే 5, 2019) భద్రాచలం, ఖమ్మంలో 45 డిగ్రీల చొప్పున అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, రామగుండంలో 44 డిగ్రీలు.. హన్మకొండ, నిజామాబాద్ లో 43 డిగ్రీలు.. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లో 42 డిగ్రీలు.. హైదరాబాద్ లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి.
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం (మే 5,2019) పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో టెంపరేచర్లు 47 డిగ్రీలుగా రికార్డ్ అయ్యాయి. మే 6, 7వ తేదీల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్ప.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తగినంత నీరు తీసుకోవాలని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలన్నారు.