వెదర్ అప్ డేట్ : తెలంగాణలో 4 రోజులూ భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి తోడైంది. దీంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. జనం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు నగరాన్ని వరుణుడు వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2019 అక్టోబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షాకాలం ముగిసే సమయంలో వానలు పడుతుండడంతో జనజీవనం స్తంభిస్తోంది. చిన్నపాటి వర్షానికే చిత్తడి చిత్తడిగా మారే హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. వాహనాలు బారులు తీరి నిలబడుతున్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లోకి భారీగా నీరు చేరుతోంది. నడుంకంటే ఎత్తులో నీరు ఉండడంతో బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అసలే రోడ్లన్నీ గుంతలతో నిండిపోయాయి. వర్షం వల్ల ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక బ్యాలెన్స్ తప్పి కిందపడిపోతున్నారు టూ వీలర్స్ వాళ్లు. తాజా హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.