హైదరాబాద్ లో భారీ వర్షం

  • Published By: veegamteam ,Published On : October 8, 2019 / 09:38 AM IST
హైదరాబాద్ లో భారీ వర్షం

Updated On : October 8, 2019 / 9:38 AM IST

వాతావరణ శాఖ చెప్పినట్టుగానే మంగళవారం(అక్టోబర్ 8,2019) హైదరాబాద్ నగరంలో భారీ కురిసింది. దసరా పండుగ రోజున ఉరుములు, మెరుపులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన వర్షం గంటసేపు కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాన నీరు డ్రైనేజీలోకి వెళ్లిపోయేలా చూస్తున్నారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, బోరబండ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమైంది. దట్టమైన మబ్బులతో పగలే చీకట్లు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకే సాయంత్రం 6 అయ్యిందా అన్నట్లుగా మారిపోయింది. బయటకు వచ్చే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ప్రకటించింది. పండుగ పూట గుళ్లకు వెళ్లాలనుకునే వాళ్లు వర్షం పడటంతో ఇబ్బంది పడ్డారు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన వర్షం రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా వానలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం(అక్టోబర్ 7,2019) భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.