హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

  • Published By: sreehari ,Published On : October 17, 2020 / 06:44 PM IST
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

Updated On : October 17, 2020 / 7:19 PM IST

Hyderabad Rains : హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం కురిసింది. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మయ్యాయి. వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షం కురిసింది.



నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యానగర్‌, గోల్నాక, రామంతాపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, అంబర్‌పేట, కాచిగూడలో భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీ నగర్‌, మన్సూరాబాద్, నాగోల్‌, హబ్సిగూడ, వనస్థలిపురం, హయత్‌నగర్‌, బీ.ఎన్‌.రెడ్డి, సైదాబాద్, చంపాపేట ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.



జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, సరూర్ నగర్‌లోనూ వర్షం పడింది. పంజాగుట్ట, ముషీరాబాద్, హస్తినాపురం, అమీర్ పేట్, కూకట్ పల్లిలో వర్షం పడింది. దీంతో పలు కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.



నగరంలో మరోసారి వర్షాలు కురవడంతో అత్యవసర సహాయ బృందాలు అప్రమత్తమయ్యాయి. రహదారులపై వరద నీరు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం  ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.