డ్యూటీకి రాకపోతే ఉద్యోగం ఊస్టింగ్, ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్

  • Published By: madhu ,Published On : October 5, 2019 / 09:04 AM IST
డ్యూటీకి రాకపోతే ఉద్యోగం ఊస్టింగ్, ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్

Updated On : October 5, 2019 / 9:04 AM IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై గంటలు గడిచిపోతున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 6గంటలలోపు విధుల్లో చేరాలన్న అల్టిమేటంకు కొద్ది గంటలు మాత్రమే మిగిలివుంది. అయినా.. ఇటు ప్రభుత్వం… అటు యూనియన్ నాయకులు పట్టు వీడడం లేదు. సమ్మెలోకి దిగాక వెనకడుగు వేసేది లేదంటూ కార్మికులు మొండిగా వ్యవహరిస్తున్నారు.

సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భవిష్యత్‌లో ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని ఖరాఖండిగా చెప్పేశారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మె పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానం..రూప కల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం 3 ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. 3 వేల నుంచి 4 వేల ప్రైవేటు బస్సులను అద్దె తీసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 

ప్రయాణికుల ఇబ్బందులను వీలైనంతగా తగ్గిస్తామన్న మాట ఇచ్చిన ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. తామిచ్చిన గడువులోపు విధుల్లో చేరకుంటే తీవ్ర చర్యలుంటాయన్న ప్రభుత్వం… ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. అయినా ఆర్టీసీ సంఘాలు మెట్టుదిగడంలేదు. సమ్మె విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ యూనియన్లు స్ట్రైక్‌ నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదంటున్నాయి. 

సమ్మెతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నా, వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. మొండిపట్టు వీడటంలేదు. దీంతో సాయంత్రం 6గంటల తర్వాత ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. గడువులోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందా?… వారిని విధుల నుంచి  శాశ్వతంగా తొలగిస్తుందా? మళ్లీ విధుల్లోకి తీసుకోబోమన్న మాటలను నిజం చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read More : ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి : బాలుడికి గాయాలు