పోలవరం రచ్చ : గవర్నర్‌కు కేవీపీ వినతిపత్రం

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ KVP రామచంద్రరావు కలిశారు. మే 16వ తేదీ గురువారం రాజ్ భవన్‌కు వచ్చిన కేవీపీ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తర్వాత సమావేశానికి సంబంధించిన విషయాలను ఆయన మీడియాకు తెలియచేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపించి..చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరినట్టు వెల్లడించారు. గవర్నర్ మరిన్ని వివరాలను కోరారని, తన వద్ద ఉన్న అన్ని వివరాలనూ ఆయనకు అందించానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగుకోసం ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని చెప్పానని పేర్కొన్నారు. తాను గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో ఎన్నో విషయాలను పొందుపరిచానని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కేవీపీ తెలిపారు.
వినతిపత్రంలోని ముఖ్యాంశాలు : –
* పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలి.
* పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై విచారణ జరిపించాలి.
* పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రానికి ఇవ్వమని కేంద్రం / నీతి ఆయోగ్‌ను రాష్ట్రం తరపున కోరింది ఎవరు ?
* పోలవరం నిర్మాణం రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రం పెట్టిన కండీషన్‌లు ఏంటీ ?
* పోలవరం ఖర్చులను ముందు తమ నిధుల నుండి భరించి తర్వాత కేంద్రం నుంచి తీసుకుంటామని కేంద్రానికి రాష్ట్రం తెలిపిందా ?
* పోలవరం సవరించిన అంచనాలను రెండు విధాలుగా ఎందుకు తయారు చేయవలసి వచ్చింది ?
* జీవో 22,జీవో 67 కిందా ఇప్పటి వరకు పోలవరం కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు ? వీటిని కేంద్రం భరిస్తుందా ?
* పోలవరం జాతీయ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ఖజానాపై కనీసం ఒక రూపాయి భారం పడ్డ …రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరు బాధ్యత వహిస్తారు ?
* పోలవరం పై ఎపి హైకోర్టులో తాను దాఖలు చేసిన పిల్‌లో కౌంటర్ వెంటనే వేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.