సూర్య ప్రతాపం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 06:28 AM IST
సూర్య ప్రతాపం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Updated On : April 2, 2019 / 6:28 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎండ‌లు మండుతున్నాయి. ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తూ ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స‌మ్మర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.  

హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణలో పలుచోట్ల ప‌గ‌టి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రామగుండం, కొత్తగూడెం పట్టణాల్లో గరిష్టంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిర్మల్ జిల్లా పెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

మరోవైపు రెండు రోజుల్లో వర్షాలు కూడా కురవొచ్చని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పగలంతా భానుడు భగభగలాడగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. సాయంత్రానికి భారీ స్థాయిలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

మరోవైపు అతినీలలోహిత కిరణాల సూచీ పది పాయింట్లకు చేరింది. సాధారణంగా యూవీ సూచీ 9 పాయింట్లకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అతినీలలోహిత కిరణాల తాకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల బారిన పడటం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.