ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం : సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు. సమ్మెపై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. వాటిపై సుదీర్ఘంగా చర్చించాయి.
కోర్టు తీర్పును పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అత్యవసర సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి అంశాన్ని వెలువరిస్తారోనన్న ఆసక్తి కలుగుతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే డిమాండ్ ను జేఏసీ పక్కన పెట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. అలాగే రూట్ల ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెప్పిందంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో సమ్మెను కొనసాగించాలా లేదా విరమించాలా అన్న అంశంపై కార్మికులు తర్జభర్జన పడుతున్నారు.
ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ అఖిలపక్షం నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ను నేతలు తప్పుబట్టారు. సమస్య పరిష్కారం కాకుంటే త్వరలో ఢిల్లీ వెళ్లి ఈ అంశాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని అఖిలపక్ష నేతలు అన్నారు. కోర్టు తీర్పు, ప్రభుత్వ అఫిడవిట్, ఐఏఎస్ అధికారుల కోడ్ ఆఫ్ కండక్ట్, సునీల్ శర్మ అఫిడవిట్ కాపీలను నేతలు గవర్నర్ కు సమర్పించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ ఆర్టీసీ అంశంపై రాజ్యసభలోనూ ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ ఎం.ఏ ఖాన్ సమ్మెను సభలో ప్రస్తావించారు. 50 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఖాన్ ఆరోపణలు చేశారు. సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు అన్నారు.
ఆర్టీసీ సమస్య జఠిలంగా మారిందని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. సమ్మెను చట్ట వ్యతిరేకంగా చూడొద్దని కోదండరామ్ అన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే కేంద్రాన్ని కలుస్తామని బీజేపీ నేత మోహన్ రెడ్డి చెప్పారు. ఆర్టీసీ సమస్యను రాష్ట్రపతి, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేత ఎల్.రమణ తెలిపారు.