చర్చలు విఫలం : సమ్మెకు వెళ్తామన్న ఆర్టీసీ కార్మికులు

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 08:18 AM IST
చర్చలు విఫలం : సమ్మెకు వెళ్తామన్న ఆర్టీసీ కార్మికులు

Updated On : October 4, 2019 / 8:18 AM IST

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మికుల డిమాండ్లకు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలకు మధ్య పొంతన కుదరడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 4,2019) ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలను బహిష్కరించిన కార్మిక సంఘాలు సమావేశం నుంచి బయటకు వచ్చేశాయి. శనివారం(అక్టోబర్ 05,2019) నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని జేఏసీ ప్రకటించింది.

తమ డిమాండ్లను త్రిసభ్య కమిటీ పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఎస్మాకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమ్మెకి ప్రజలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. సమ్మెలో ఆర్టీసీకి చెందిన 50వేల మంది ఉద్యోగులు పాల్గొటారని తెలిపారు. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలమంది కార్మికులకు ద్రోహం చేసినట్లే అన్నారు. డిమాండ్లు నెరవేర్చితేనే సమ్మె ఆపుతామని కార్మిక సంఘాలు అంటుంటే.. డిమాండ్లు నెరవేర్చే విషయంలో తమకు మరికొంత సమయం కావాలని త్రిసభ్య కమిటీ కోరుతోంది. 

సరిగ్గా పండగ సమయాన్ని చూసుకుని సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునివ్వడంపై ప్రయాణికుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పండగకు ఊరు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లు.. బస్సులు నడుస్తాయో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అదనపు ఆదాయం వచ్చే ఈ సమయంలో సమ్మె చేయడం సబబా.. అన్న విమర్శలూ వస్తున్నాయి.