కార్తీకమాసం చివరి సోమవారం : భక్తులతో కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో ఈ రోజు తెల్లవారుఝూము నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ద్రాక్షారామం దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. సామర్లకోట, పిఠాపురం పాదగయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక భైరవకోన, త్రిపురాంతకం, ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కొత్తపట్నం, వాడరేవు, పాకల, రామాయపట్నంలో భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు.
ఇక అలంపూర్‌లోని జోగులాంబ క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బాలబ్రహ్మేశ్వరసామి, జోగులాంబలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని భక్తుల రద్దీ నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి.. భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోనూ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. నాగులకట్ట దగ్గర మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. అటు మహనందిలో భక్తుల తాకిడి పెరిగింది. కొనేర్లలో స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాల్ని వెలిగించి పూజలు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక, పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, అమరావతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పంచరామాలను ఒకే రోజు దర్శనం చేసుకుంటే జ్యోతిర్లాంగాలను దర్శించిన ఫలం దక్కుతుందని నమ్ముతారు.