Speed Guns : హైదరాబాద్ రోడ్లపై గన్స్.. ఇకపై స్పీడ్‌గా వెళితే జేబుకి చిల్లే
రోడ్డు ఖాళీగా ఉందని రయ్ మని దూసుకెళ్తున్నారా? పోలీసులు ఎవరూ లేరు కదా అని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే మీ జేబుకి చిల్లు పడినట్టే. ఫుల్ జోష్ లో ఉన్న మీ స్పీడ్ కు బ్రేక్ లు వేసినట్టే. ఎంత చెప్పినా వినని వారిని గాడిన పెట్టేందుకు పోలీసులు గన్స్ తీసుకొచ్చారు.

Speed Guns
Speed Guns : రోడ్డు ఖాళీగా ఉందని రయ్ మని దూసుకెళ్తున్నారా? పోలీసులు ఎవరూ లేరు కదా అని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే మీ జేబుకి చిల్లు పడినట్టే. ఫుల్ జోష్ లో ఉన్న మీ స్పీడ్ కు బ్రేక్ లు వేసినట్టే. ఎంత చెప్పినా వినని వారిని గాడిన పెట్టేందుకు పోలీసులు గన్స్ తీసుకొచ్చారు.
హైదరాబాద్ రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లి వారి స్పీడ్ కు చెక్ పెట్టేందుకు, అలాగే ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మెన్షన్ చేసిన స్పీడ్ ప్రకారమే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. కాదని స్పీడ్ పెంచారో దాని పరిణామం ఈ చలాన్ రూపంలో మీ ఇంటికి చేరుతుంది.
నగరంలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో అతి వేగం కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల స్పీడ్ ని కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జి, బయో డైవర్సిటీ, నార్సింగి తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ నియంత్రణ అటెన్షన్ బోర్డులను కూడా ట్రాఫిక్ పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. ఆ హెచ్చరిక బోర్డులను పట్టించుకోకుండా అతివేగంగా వెళ్లిన వాహనాలను గుర్తించి ఈ చలాన్లు విధిస్తున్నారు.
పోలీసులు వెర్షన్ ఇలా ఉంటే, వాహనదారుల అభిప్రాయం మరోలా ఉంది. ట్రాఫిక్, ఆర్టీఏ రూల్స్ పై ప్రభుత్వ శాఖలు కనీస అవగాహన కల్పించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాద సూచిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు వాహనదారులకు కనిపించేలా ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. రూల్స్ గురించి తమకు తెలియక స్పీడ్ గా వెళ్లడంతో చలాన్లు విధిస్తున్నారని వాపోయారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
మొత్తంగా.. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే చలాన్ల బాధ తప్పుతుందని పోలీసులు తేల్చి చెబుతున్నారు. అతి వేగంతో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలితీసుకోవద్దని కోరుతున్నారు. స్పీడ్ లిమిట్, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.