బీజేపీ ఇజ్జత్ కీ సవాల్ : 5 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి లోక్‌సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి ఉన్న సిట్టింగ్ స్థానాలను కాపాడుకోలేకపోయింది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఆశించకుండా గెలుస్తామనుకున్న స్థానాలపైనే దృష్టి సారించింది. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరి లోక్‌సభ ఎన్నికల్లోనైనా టార్గెట్ రీచ్ అవుతుందా ? లేక ఉన్న ఒక్క స్థానాన్ని పోగొట్టుకుని బొక్కబోర్లా పడుతుందో వేచి చూడాలి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకునేందుకు కమల దళం వ్యూహాలు రచిస్తోంది. 17పార్లమెంట్ స్థానాల్లో పోటీకి అభ్యర్ధులను నిలబెట్టినా, గెలిచే స్థానాలపైనే దృష్టి సారించింది. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేడర్ బలంగా ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరి స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేడర్‌కు పిలుపునిచ్చింది.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపి సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి నాలుగుసార్లు బీజేపీ అభ్యర్ధులు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి బీజేపీ అభ్యర్థిగా అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు గెలిచిన కిషన్ రెడ్డిని బరిలో నిలిచారు. ఐక్యమత్యంతో పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పైన మరోసారి జెండా ఎగురవేయాలని కాషాయదళం ఉవ్విళ్లూరుతోంది. ఇక మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంపై కూడా బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. ఇటీవల కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన డీకే అరుణను ఇక్కడ నుండి అభ్యర్థిగా పోటీకి నిలబెట్టింది. డీకే అరుణ సొంత బలానికి, బిజెపి క్యాడర్ తోడైతే మహబూబ్‌నగర్లో కమలం జెండా ఎగరడం పెద్ద కష్టం కాదని భావిస్తోంది. అలాగే నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు డి.శ్రీనివాస్ తనయుడు.. ధర్మపురి అరవింద్‌ను బరిలో దింపింది. ఈయన కొంత కాలంగా బిజెపిలో చురుకుగా పని చేస్తున్నారు. అరవింద్ గెలుస్తారని బీజేపీ ఆశిస్తోంది. మల్కాజ్ గిరి నుండి బిజెపి ఏకైక ఎమ్మెల్సీ రామచంద్ర రావు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉత్తరాది వారితో పాటు రామచందర్ రావు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం, కంటోన్మెంట్ ఏరియా కూడా మాల్కాజ్‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి రావడం తమకు కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక కరీంనగర్ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఆయన కొంతకాలంగా హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. బిజెపిలో రాజాసింగ్ తర్వాత హిందుత్వాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తారని బండి సంజయ్ పేరు తెచ్చుకున్నారు. నేరెళ్ల లాంటి ఘటనలు బయటికి తీసుకొచ్చి ప్రజల్లో గుర్తింపు పొందారు. దీంతో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని కొంచెం కష్టపడితే దక్కించుకోవడం కష్టం కాదని బిజెపి నేతలు లెక్కలు వేస్తున్నారు.
ఈ ఐదు నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని జాతీయ నేతల సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా మోడీ, అమిత్ షా సభలు మహబూబ్ నగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజమాబాద్, పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని, అమిత్ షా సభల వల్ల తమకు కలిసి వస్తుంది అంచనా వేస్తున్నారు. ప్రతీ అంశాన్ని సద్వినియోగం చేసుకుని, విజయం సాధిస్తామంటున్నారు కమలం నేతలు. కాగా… కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఆదివారం నాడు ఎక్స్ సర్వీస్‌మెన్లు, మేథావులతో సమావేశం నిర్వహించి రామచంద్రరావు తరుఫున ప్రచారం కూడా నిర్వహించారు.