అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ

  • Published By: veegamteam ,Published On : September 30, 2019 / 06:34 AM IST
అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ

Updated On : September 30, 2019 / 6:34 AM IST

తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం (అక్టోబర్ 1)  ప్రగతి భవన్‌లో  సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ సమ్మె,కొత్త రెవెన్యూ చట్టం వంటి పలు అంశాలపై చర్చ జరుగనున్నట్లుగా తెలుస్తోంది. 

కొత్త రెవెన్యూ చట్టంపై ఆసక్తి చూపిస్తున్న సీఎం ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ముగిసిన సమావేశాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 

కొత్త సెక్రటేరియట్ నిర్మాణం..పాత సెక్రటేరియట్ కూల్చివేత అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇప్పటికే సచివాలయం తరలింపు పూర్తయింది. భవనాల కూల్చివేతపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇకపోతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి పలు కీలక డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించనుంది. సమ్మె జరగకుండా ఉండేందుకు తీసుకొవాల్సిన చర్యలపై తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో చేసినట్టుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమా ? లేక కార్మికులు లేవనెత్తిన ఇతర డిమాండ్లపై చర్చకు కమిటీ వేయడమా? అన్న అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.