విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు : రాష్ట్రంలో రోడ్డెక్కిన బస్సులు

సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్ పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల నుంచి బస్సులు బయటికి వచ్చి రోడ్డెక్కాయి. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డిపో నుంచి సుమారు 600 ఉద్యోగులు విధుల్లో చేరేందుకు డిపోకు చేరుకున్నారు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న25 డిపోల్లోని 3వేలు బస్సులు రోడ్డుపైకి వస్తున్నాయి. రాష్ట్రన్యాప్తంగా ఉన్న 97 డిపోల్లోని 49 వేల మంది సిబ్బంది విధుల్లోకి చేరారు.
ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,862 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరుకు దాదాపు 15 మంది కండక్టర్‌లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.