42 డిగ్రీలు : మరో రెండు రోజులు ఎండలే ఎండలు

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 05:06 AM IST
42 డిగ్రీలు : మరో రెండు రోజులు ఎండలే ఎండలు

Updated On : April 3, 2019 / 5:06 AM IST

హైదరాబాద్‌ : నగరంలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతునే ఉన్నాయి. ఎండల ప్రభావానికి పగటిపూట బైటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. గతంలో కంటే ఈ వేసవిలో సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఈ క్రమంలో వరుసగా నాలుగు రోజుల నుంచి 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పగటి సమయంలో ఇలా ఉంటే ఇక రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26 డిగ్రీలుగా ఉండటంతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముషీరాబాద్‌, మైత్రివనం, శ్రీనగర్‌కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, మణికొండ, మాదాపూర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంగళవారం (ఏప్రిల్ 2)హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 40.4, కనిష్ఠం 26.3 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే తీవ్రమైన ఎండ, వడగాల్పుల కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ అంతంతమాత్రంగానే ఉంటుండగా..మధ్యాహ్నం 12-3 గంటల మధ్య రోడ్లు బోసిపోతున్నాయి. ఈ క్రమంలో మరో రెండురోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇవే స్థాయిలో కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో బైటకువచ్చినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
గత నాలుగురోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి..

వారం గరిష్ఠం కనిష్ఠం
మంగళవారం  40.4 26.3
సోమవారం  40.2 26.7
ఆదివారం  40.9 24.9
శనివారం    40.2 24.1