Afghanistan President : ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు రాజీనామా!

ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని తాలిబన్లు మరియు పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న వేళ ఇవాళ రాత్రి రేపు ఆఫ్ఘాన్ ప్రజలనుద్దేశించి అష్రఫ్ ఘనీ ప్రసంగించనున్నారని..ఈ ప్రసంగంలో ఆయన తన రాజీనామా గురించి ప్రకటించనున్నారని సమాచారం.

Afghanistan President : ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు రాజీనామా!

Ashraf2

Updated On : August 13, 2021 / 7:14 PM IST

Afghanistan President ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలని తాలిబన్లు మరియు పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న వేళ ఇవాళ రాత్రి రేపు ఆఫ్ఘాన్ ప్రజలనుద్దేశించి అష్రఫ్ ఘనీ ప్రసంగించనున్నారని..ఈ ప్రసంగంలో ఆయన తన రాజీనామా గురించి ప్రకటించనున్నారని సమాచారం.

కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిందని, తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికార మార్పిడి ఏ విధంగా జరుగుతందనేదానిపై అష్రఫ్ ఘనీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. కొద్ది గంటల్లో ఏం జరుగుతుందనే చర్చ ఊపందుకుంది.

మరోవైపు, ఖతార్ లో తాలిబన్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాలు ఉపసంహరణతో అక్క‌డ మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్య‌మేల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న విషయం తెలిసిందే. అఫ్గానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడు పెంచారు. తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్ర‌ధాన న‌గరాల‌ను ఆక్ర‌మిస్తూ వస్తోంది. మొత్తం 34 రాష్ట్రాలు ఉన్న అఫ్గాన్​లో.. 18 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల వశమయ్యాయి. దేశంలోనే రెండవ అతిపెద్ద నగరమైన కాందహార్ ని కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్లను అదుపుచేయడం ఆఫ్ఘాన్ ప్రభుత్వ దళాల వల్ల కావడం లేదు.

ప్రస్తుతం మూడింట రెండో వంతు అఫ్గాన్ భూభాగం తాలిబన్ల చేతిలో ఉంది. కాబుల్​ వరకు ముష్కరులు ఇంకా చేరుకోలేదు. ప్రత్యక్ష దాడులేవీ రాజధానిపై జరగలేదు. కానీ, వరుసగా ఒక్కో నగరాన్ని మెరుపు వేగంతో కోల్పోవడం.. అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాలిబన్లు మాత్రం కాబుల్​ను మరో వారం రోజుల్లోనే కాబుల్​ను ఆక్రమించుకుంటామని చెబుతున్నారు. మరోవైపు, అఫ్గానిస్థాన్ ఉపాధ్యక్షుడు తజకిస్థాన్​కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అష్రఫ్ ఘనీ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక, దేశంలో హింసను అదుపు చేసేందుకు తాలిబన్లతో అధికారాన్ని పంచుకోవడానికి అఫ్గాన్​ ప్రభుత్వం సిద్ధమైనట్లు గురువారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఖతార్‌లోని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వం.. మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ ప్రతిపాదన ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.