Sheikh Hasina: షేక్ హసీనాను అప్పగించండి: భారత్‌కు డిప్లొమాటిక్‌ నోట్‌ పంపిన బంగ్లాదేశ్

ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు.

Sheikh Hasina: షేక్ హసీనాను అప్పగించండి: భారత్‌కు డిప్లొమాటిక్‌ నోట్‌ పంపిన బంగ్లాదేశ్

Updated On : December 23, 2024 / 5:32 PM IST

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా(77)ను తిరిగి తమ దేశానికి పంపాలంటూ భారత్‌కు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం దౌత్యపర నోట్‌ను పంపింది. బంగ్లాదేశ్‌కు 16 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా పాలనపై తిరగబడుతూ విద్యార్థుల నేతృత్వంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో ఆమె దేశాన్ని వీడి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) హసీనాతో పాటు పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక, పౌర అధికారులకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో దీనిపై బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ తన ఆఫీసు వద్ద మీడియాతో మాట్లాడుతూ… న్యాయపర ప్రక్రియను కొనసాగించడానికి ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని తాము కోరుతున్నట్లు భారత ప్రభుత్వానికి మౌఖికంగా నోట్ పంపామని తెలిపారు.

ఇదే విషయంపై ఇవాళ ఉదయం బంగ్లాదేశ్ హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలం మాట్లాడుతూ.. షేక్ హసీనాను భారత్‌ తమకు అప్పగించేలా చొరవ తీసుకోవాలని తమ విదేశాంగ మంత్రిత్వ శాఖకు హోం శాఖ కార్యాలయం లేఖ పంపిందని చెప్పారు. ఈ మేరకు బంగ్లా విదేశాంగ శాఖ భారత్‌కు ఈ విజ్ఞప్తి చేసింది.

గత నెలలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరుతున్నట్లు చెప్పారు.

KA Paul: తెలంగాణలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలవుతోంది: కేఏ పాల్