47ఏళ్ల తర్వాత బ్రిటన్ కు స్వేచ్ఛ…కొత్తగా మారబోయేవి ఇవే

47ఏళ్ల యూరోపియన్ యూనియన్(EU)సభ్య దేశం నుంచి ఎట్టకేలకు శుక్రవారం(జనవరి-31,2020)రాత్రి11గంటలకు బయటకొట్టింది. 27యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి నుంచి బ్రిటన్ అధికారంగా బయటికొట్టించి. దీనినే మనం బ్రెగ్జిట్ అంటాము. అంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం. బ్రిటన్ లో శుక్రవారం బ్రెగ్జిట్ సంబరాలు అంబరాన్నంటాయి. బ్రిటన్ పార్లమెంట్ బయట ఉన్న వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్..ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణను నిజమైన జాతీయ పునరుద్ధరణ, మార్పు యొక్క క్షణంగా అభివర్ణించారు. 1973లో ఈయూ కూటమిలో బ్రిటన్ చేరింది.
వాస్తవానికి ఈయూ నుంచి వైదొలిగేందుకు బ్రిటన్‌లో రెఫరెండం నిర్వహించి మూడేళ్లకుపైనే అయ్యింది. 1973లో ఈయూ కూటమిలో చేరిన బ్రిటన్…ఆ కూటమి నుంచి వైదొలిగేందుకు 2016లోనే బ్రిటన్ లో రిఫరెండం నిర్వహించారు. అయితే బ్రెగ్జిట్ ప్రక్రియలో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. 2016 రిఫరెండం నుంచి ఇప్పటివరకు ఆ దేశానికి ముగ్గురు ప్రధానులు మారారు. రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత 11 నెలల ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. అది ఇప్పుడు మొదలైంది. ఈ పీరియడ్‌లో బ్రిటన్ ఈయూ నిబంధనలను పాటిస్తుంది. ఈయూకు డబ్బులు కూడా చెల్లిస్తుంది. డిసెంబర్ 31,2020తో ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ ముగుస్తుంది.
బ్రిటన్‌లో ఇక మీద చాలా విషయాలు మారబోతున్నాయి.
1. బ్రిటన్ బ్రెగ్జిట్ విభాగానికి మూత
బ్రిటన్-ఈయూ మధ్య సంప్రదింపుల వ్యవహారాలను పర్యవేక్షించిన బ్రిటన్ బ్రెగ్జిట్ విభాగం శుక్రవారంతో మూతపడింది. మాజీ ప్రధాని థెరిసా మే 2016లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇకపై ప్రధాని కార్యాలయంలోని కొత్త విభాగం సంప్రదింపుల వ్యవహారాలను పరిశీలిస్తుంది.
2. ఈయూ సదస్సులకు హాజరుకారు
సాధారణంగా జరిగే ఈయూ సమావేశాలకు బ్రిటన్ మంత్రులు హాజరు కారు. ఒకవేళ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప బ్రిటన్ ప్రధాని ఈయూ కౌన్సిల్ సదస్సులకు బ్రిటన్ మంత్రులు వెళ్లరు.
3. బ్రిటన్ ఈయూ ఎంపీలు సభ్యత్వం కోల్పోతారు
ఈయూలోని అన్ని రాజకీయ సంస్థల నుంచి బ్రిటన్ బయటకు వచ్చేస్తోంది. యురోపియన్ పార్లమెంటులోని బ్రిటన్ ఎంపీలు తమ సభ్యత్వాలు కోల్పోతారు. ట్రాన్సిషన్ పీరియడ్‌లో మాత్రం న్యాయవివాదాలేవైనా ఏర్పడితే అంతిమంగా పరిష్కరించే అధికారం యురోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు ఉంటుంది.
4. కొత్త వాణిజ్య విధానం
వస్తు సేవల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వివిధ దేశాలతో ఇక బ్రిటన్ సంప్రదింపులు చేసుకోవచ్చు. కొత్త నిబంధనలను రూపొందించుకోవచ్చు. ఈయూలో సభ్యత్వం ఉన్న సమయంలో బ్రిటన్‌కు.. ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో సంప్రదింపులు జరిపే వీలుండేది కాదు. ఇప్పుడు సొంతంగా వాణిజ్య విధానం రూపొందించుకునే స్వేచ్ఛ రావడం వల్ల బ్రిటన్ ఆర్థికవ్యవస్థ వృద్ధికి ఊతం వస్తుందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఇతర దేశాలతో బ్రిటన్ చేసుకునే వాణిజ్య ఒప్పందాలు, ట్రాన్సిషన్ పీరియడ్ ముగిశాకే అమల్లోకి వస్తాయి.
5. నేరస్థులను జర్మనీ అప్పగించదు
జర్మనీ పౌరులు ఎవరైనా బ్రిటన్‌లో నేరం చేసి, సొంత దేశానికి పారిపోతే.. వారిని వెనక్క రప్పించడం కుదరదు. ఇది వరకు జర్మనీ అలాంటి అనుమానిత నేరస్థులను బ్రిటన్‌కు అప్పగించేది. ఈయూయేతర దేశాలకు నేరస్థులను అప్పగించకూడదని జర్మనీ రాజ్యాంగంలో ఉన్న విషయం తెలిసిందే.
6. పాస్‌పోర్టుల రంగు మారుతుంది
బ్రిటన్‌లో ప్రస్తుతం ఉన్న మెరూన్ రంగు పాస్‌పోర్టులు పోయి, నీలి రంగు పాస్‌పోర్టులు వస్తాయి. 30 ఏళ్ల క్రితం వరకూ బ్రిటన్ లో ఈ నీలి రంగు పాస్‌పోర్టులే ఉండేవి. 1921లో వాటిని ముద్రించడం ప్రారంభించారు. దాదాపు వచ్చే ఆరు నెలల్లో ఇలా మొత్తం పాస్‌పోర్టులను దశలవారీగా మార్చేస్తారు.
7. బ్రెగ్జిట్ నాణేలు
బ్రెగ్జిట్ స్మారకంగా 50 పెన్స్‌ల నాణేలు రాబోతున్నాయి. మొత్తం 30 లక్షల నాణేలపై ఓ ఐకమత్య సందేశాన్ని, బ్రెగ్జిట్ తేదీని (జనవరి 31, 2020) ముద్రించారు. ఈ నాణేల ముద్రణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరైనా తమకు ఈ నాణేలు ఇస్తే తీసుకోమని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు అంటున్నారు.
అయితే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపై కొంతమంది నెలటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తుండగా ఎక్కువమంది బ్రెగ్జిట్ ను ప్రశంసిస్తున్నారు. బ్రిటన్ కు స్వాతంత్ర్యం రోజు అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రిటన్ల కలలను నెరవెర్చాడని ప్రశంసిస్తున్నారు. బ్రిగ్జెట్ బాటలోనే మరికొన్ని ఈయూ దేశాలు కూడా నడుస్తాయని ఆశిస్తున్నామంటూ మరికొందరు తమ అభిప్రయాలను వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ తర్వాత వచ్చేది సెగ్జిట్(స్వీడన్ ఈయూ నుంచి వైదొలగడం) అంటూ మరికొందరు సోషల్ మీడియలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.