China : బుద్ధి మార్చుకోని చైనా.. ఒకపక్క స్నేహం అంటూనే.. మరోవైపు సరిహద్దుల్లో భారీ రక్షణ నిర్మాణాలు.. అసలేం జరుగుతుందంటే?
China building new defence site near India border : చైనా ఒకవైపు భారత్ కు స్నేహ హస్తం అందిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో ..
China building new defence site near India border
China building new defence site near India border : చైనా ఒకవైపు భారత్ కు స్నేహ హస్తం అందిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థను మోహరిస్తోంది. గల్వాన్ లోయకు అతి సమీపంలో టిబెట్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా కొత్త గగన రక్షణ సముదాయాన్ని (ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్) నిర్మిస్తోంది. ఇందులోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, విస్తృతమైన మౌలిక సదుపాయాలు కారణంగా ఈ నిర్మాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భారత్ – చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో 2020 సంవత్సరంలో ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు 110 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు తూర్పు వైపున ఈ నిర్మాణం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఇటీవల బయటపడ్డాయి.
ఉపగ్రహ చిత్రాలను బట్టి చూస్తే.. ఈ కాంప్లెక్స్ లో భారీ కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బ్యార్ లు, వాహనాలు నిలిపి ఉంచే షెడ్లు, ఆయుధ నిల్వ గోదాములు, రాడార్ సిస్టంలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షిపణి లాంచింగ్ వాహనాలను రహస్యంగా దాచి ఉంచేందుకు భారీ బంకర్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా చైనా దీర్ఘశ్రేణి హెచ్ క్యూ-9 సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (ఎస్ఏఎం) వ్యవస్థలను దాచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రువు నిఘాకు దొరకకుండా తమ క్షిపణి వ్యవస్థలను దాచేందుకు ఈ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 29వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రాల్లో కొన్ని బంకర్ భవనాల పైకప్పులు క్షిపణి ప్రయోగానికి అనువుగా తెరిచి ఉండగా.. కొన్నింటికి మూసి ఉండటం కనిపించింది. ఈ రకమైన భవనాలు చైనా క్షిపణి వ్యవస్థలకు అన్ని రకాలుగా రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శత్రువుల ఎదురుదాడి నుంచి తన క్షిపణి వ్యవస్థలను రక్షిస్తాయి.
అయితే, ఫాంగాగ్ సరస్సు సమీపంలో చైనా చేపట్టిన ఈ నిర్మాణాలను గత జూలై నెలలో జియోస్పేషియల్ పరిశోధకుడు డామియన్ సైమన్ మొదటిసారిగా గుర్తించారు. అయితే, ఆ సమయంలో అక్కడ ఏం నిర్మిస్తున్నారన్న అంశంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎయిర్ ఢిపెన్స్ కాంప్లెక్సుల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో అమెరికా వర్సెస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ తో స్నేహపూర్వక వాతావరణంను పునరుద్దరించుకునే ప్రయత్నాలను చైనా చేపట్టింది. ఈ క్రమంలోనే చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సు (SCO)లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. అయితే, చైనా ఒకపక్క భారతదేశంతో స్నేహం అంటూనే.. మరోవైపు సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే, భారత ప్రభుత్వం చైనా వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.
