కరోనా కల్లోలం : 19 దేశాలకు విస్తరించిన వైరస్

చైనాలో పుట్టిన కరోనా వైరస్...  రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 08:08 AM IST
కరోనా కల్లోలం : 19 దేశాలకు విస్తరించిన వైరస్

Updated On : January 31, 2020 / 8:08 AM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్…  రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.

చైనాలో పుట్టిన కరోనా వైరస్…  రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. కోరలు చాస్తూ ఖండాంతరాలకు వ్యాపిస్తోంది. ఈ రాకాసి వైరస్ దెబ్బకు చైనాలో ఇప్పటికే 213 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో మొన్నటిదాకా 170 ఉండగా..ఒక్క రోజు తేడాలో 213కు చేరిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నిన్న ఒక్కరోజే 43మంది మృతి చెందారు. మరో 9692మంది అస్వస్థకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 1,982 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. 

అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
మరోవైపు.. ఈ మహమ్మారి.. భూగోళాన్ని చుట్టుముట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని, తక్షణ చర్యలను చేపట్టాలని సూచించింది. ఉమ్మడిగా ఎదుర్కొనడం ద్వారానే ఈ వైరస్‌ను నియంత్రించగలుగుతామని స్పష్టంచేసింది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి. అటు.. చైనాలో ఉన్న తమ దేశ పౌరులను తరలించేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ ఏర్పాట్లు చేశాయి.

ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించిన అమెరికా  
అమెరికా ప్రభుత్వం తాజాగా ట్రావెల్ అడ్వైజరీని ప్రకటించింది. చైనాకు వెళ్లే అమెరికన్లు.. తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. చైనాలో కరోనా వైరస్ విస్తృతంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఆ దేశానికి వెళ్లవద్దని హెచ్చరించింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతే.. చైనాకు వెళ్లేలా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొంది. చైనాను వణికిస్తున్న వైరస్.. భారత్‌కు కూడా చేరడంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కేరళలో ఓ విద్యార్థికి ఈ డెడ్లీ వైరస్ సోకినట్లు నిర్ధారించగా… తాజాగా మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలతో త్రిస్సూర్‌లోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.

కరోనా విజృంభణతో అలర్టయిన కేరళ సర్కార్
మొత్తం 15మందికి కరోనా సోకినట్లు అనుమానాలు ఉండటంతో… వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య  పరిస్థితిని పరిశీలిస్తోందిది. ఇందులో 9మందిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తుండగా… మరో ఆరుగురికి మాత్రం ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నారు. కరోనా విజృంభణతో అలర్టయిన కేరళ సర్కార్… ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.

హైదరాబాద్‌లో ఇద్దరికి కరోనా లక్షణాలు 
హైదరాబాద్‌లోనూ ఇద్దరికి కరోనా లక్షణాలుండటంతో ఆస్పత్రిలో చేర్చారు. గాంధీ ఆస్పత్రిలో ఒకరికి, ఫీవర్ ఆస్పత్రిలో మరొకరికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వారి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు… కరోనా నిర్ధారణ కోసం పుణెకు పంపించారు. మరోవైపు… దేశవ్యాప్తంగా 12చోట్ల కరోనా పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 

మరో రెండ్రోజుల్లో హైదరాబాద్‌లోనే కరోనా టెస్ట్‌లు 
చైనా నుంచి వచ్చేవారికి ఫ్లూ లక్షణాలున్నా, లేకున్నా కనీసం 2వారాలపాటు వారిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే… కరోనా  పరీక్షలకు కావాల్సిన కిట్లను హైదరాబాద్‌ పంపించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మరో రెండ్రోజుల్లో హైదరాబాద్‌లోనే కరోనా టెస్ట్‌లు చేయనున్నారు.