చైనాలో గుట్టలుగా మృతదేహాలు : అంత్యక్రియలకు కూడా అనుమతించని అధికారులు

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 04:04 PM IST
చైనాలో గుట్టలుగా మృతదేహాలు : అంత్యక్రియలకు కూడా అనుమతించని అధికారులు

Updated On : February 9, 2020 / 4:04 PM IST

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. వైరస్ తీవ్రతతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను దాటి ప్రజలను బయటకు రానివ్వడం లేదు అక్కడి అధికారులు. ఎంత అత్యవసర పరిస్థితి అయినా ప్రజలను గడప దాటి బయటకు పంపించడం లేదు. బలవంతంగా ఇంటి డోర్లు మూసి.. అవి తెరుచుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇంతకాలం ప్రజలతో కళకళలాడిన వూహాన్ నగరం.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి.. కరోనా మృతులతో మొత్తం డెడ్ సిటీగా మారిపోయింది. వూహాన్ వాసులంతా ఇప్పుడు ఆస్పత్రుల్లో లేదా ఇంట్లో మాత్రమే ఉంటున్నారు. నగరంలోని అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. నిత్యవసరాలకు సమస్య లేకుండా చైనా సర్కారు చూస్తోంది. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులను తెరిచి ఉంచింది. ప్రజలు కోరిన వస్తువులను ఇంటికే సరఫరా చేస్తోంది. ఈ వైరస్ తీవ్రత తగ్గేవరకు  ప్రజలు బయటకు రావద్దని చైనా ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

మరోవైపు కరోనా వైరస్ కారణంగా మృతిచెందినవారిని బలవంతంగా శ్మశానవాటికలకు తరలిస్తున్నారు చైనా అధికారులు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా కుటుంబసభ్యులను అనుమతించడం లేదు. దీంతో తమవారి కడసారి చూపు దక్కడంలేదంటూ వూహాన్‌ వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక శ్మశానవాటికల్లో శవాలగుట్టలు దర్శనమిస్తున్నాయి. మృతిచెందిన వారందరినీ విద్యుత్‌ దహనవాటికలో సామూహికంగా దహనం చేస్తున్నారు. 

మరణాల సంఖ్య తగ్గుతున్నట్లే ఉంటోంది. అంతలోనే ఒక్కసారిగా వందల మందిరోగులు హాస్పటిల్స్‌కు వస్తున్నారు. ఇంకా పూర్తిగా అంతుచిక్కని వైరస్ ధాటిని తట్టుకోవడం స్థానిక వైద్యుల తరం కావడంలేదు. ఏ రోగం వచ్చినా ముందు కరొనా టెస్ట్ చేయడమంటేనే సమస్య మరింత ముదురుతోంది. ఇక్కడి నుంచి వైరస్ మిగిలిన ప్రాంతాలకు వ్యాప్తి చెందకూడదని మొత్తం రాష్ట్రాన్నే దిగ్భందించేసింది చైనా. ఎంతకష్టమొచ్చినా సరే ఒక్కరినీ రాష్ట్రం దాటడానికి అనుమతి ఇవ్వడం లేదు. డాక్టర్లతో సహా ఒక్కరినీ బైటకు వదలడం లేదు.

హుబాయ్ రాష్ట్రానికి కేపిటల్ వుహాన్. ఇక్కడ కార్లఫ్యాక్టరీలు, మెడికల్ కాలేజీలు ఎక్కువ. భారతీయులే కనీసం 20వేల మంది వుహాన్ లో మెడిసిన్ చదువుకొంటున్నారు. అలాంటి రాష్ట్రాన్ని నిర్బంధించిడంతో కరొనా వైరస్‌ను తాను భరిస్తూ మిగిలిన ప్రాంతాలను రక్షిస్తోంది. అందుకే మిగిలిన ప్రాంతాల్లోss వైరస్ రోగుల్లో మరణాలు 0.16 శాతమైతే, వూహాన్ లోమాత్రం 3.1శాతం. ఇక్కడి జనం వేరే ప్రాంతాలకు వెళ్లితే వైరస్ మరింత తీవ్రంగా వ్యాపించి ఉండేది. మొత్తం చైనానే బలయ్యేది. ఒకవేళ వూహాన్ నుంచి ప్రతిరోజూ సింగపూర్, హాంగ్ కాంగ్, అమెరికాకు వెళ్లే విమానాలు వైరస్ ను తీసుకెళ్లేవి. అప్పుడు కరొనా మహమ్మారిలా మొత్తం ప్రపంచాన్నే కమ్మేసేది.

వూహాన్ గొప్ప సిటీకాదు. సెకండ్ టైర్ సిటీ. షాంగైలా ఎదగడానికి కలలుగంటున్న నగరం. మెడికల్ కాలేజీలు ఎక్కువకాబట్టి వైద్యసౌకర్యాలకు లోటులేదు. అలాగని అంతర్జాతీయ స్థాయి హాస్పటల్స్ తక్కువ. జనవరి 23న వైరస్ గురించి ప్రకటించే సమయానికి వూహాన్ నగరంలో ఉన్న ఇంటెన్సీకేర్ బెడ్స్ 110. అప్పటికే అవన్నీ వైరస్ బాధితులతో నిండిపోయాయి. ఒకటి ఖాళీ ఐతేకాని…మరొకరికి చోటులేదు. కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే వూహాన్‌ను అదునుచూసి వైరస్ దెబ్బతీసింది. రెసిడెంట్‌ ఎవిల్‌ సినిమా చూపించింది.