ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే: 144వ ప్లేస్‌లో భారత్

కరోనా వైరస్ (కోవిడ్ -19) కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆరోగ్య సంక్షోభం కలవరపెడుతుంది. దాదాపు అన్ని దేశాలు దీనిపై ఆందోళనగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా ఐక్య రాజ్య సమితి (ఐరాస) ప్రపంచంలోనే సంతోషకర దేశంగా ఫిన్‌లాండ్ నిలిచినట్లు ప్రకటించింది. సర్వే నివేదికలో వరుసగా మూడోసారి తొలి స్థానం పదిలం చేసుకుంది ఫిన్ లాండ్.
ఇక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో డెన్మార్క్ రెండవ స్థానంలో, స్విట్జర్లాండ్ మూడవ స్థానంలో తర్వాతి స్థానాల్లో ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, 20 వ స్థానంలో బెల్జియం నిలిచింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ సంతోష దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన జరుపుతుంది. ఈ క్రమంలోనే ర్యాంకులను ప్రకటిస్తుంది. నిత్యం యుద్ధాలతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది.
ఇంతకుముందు సంవత్సరాల్లోని ఏడు నివేదికల మాదిరిగానే, నార్డిక్ దేశాలు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. 2019లో 24 వ స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 2020కి 23 వ స్థానానికి ఎగబాకింది. 156 దేశాల వ్యక్తుల జీవనశైలపై, జీవన ప్రమాణాలపై వారి అవగాహనను పరిగణనలోకి తీసుకుని అలాగే జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు అవినీతి స్థాయిలను తీసుకుని ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది.
సంతోషకర సూచీలో భారత్ ర్యాంకు పొరుగు దేశాల కన్నా దారుణంగా ఉన్నది. నేపాల్ 15, పాకిస్థాన్ 29, బంగ్లాదేశ్ 107, శ్రీలంక 130వ ర్యాంకుల్లో ఉండగా భారత్ 144వ ర్యాంకులో నిలిచింది.