China Youth : ఇద్దరితోనే కష్టంగా ఉంది..వామ్మో..ముగ్గురు పిల్లలా? కష్టమేనంటున్న యువత
ఒకప్పుడు ఒక్క బిడ్డనే కనాలని నిర్భంధం విధించిన డ్రాగన్ దేశం ఆ తరువాత ఇద్దరు పిల్లల్ని కనొచ్చని ప్రకటించింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనొచ్చు అని చెప్పింది.కానీ ముగ్గుర్ని కనటానికి చైనా యువత ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. ఇద్దరితోనే కష్టంగా ఉంది...ఇక మూడో బిడ్డా? కుదరనే కుదరదు అంటోంది చైనా యువత.

China Youth
China Announcement of three children : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? అంటే ఠక్కుమని ‘చైనా’ అని చెప్పేస్తాం. చైనాలో జనాభా భారీగా పెరిగిపోతున్నక్రమంలో చైనా ‘ఇద్దరు పిల్లలు కూడా వద్దు ఒక్క బిడ్డే ముద్దు’ అంటూ పిల్లల్ని కనటంలో పరిమితులను విధించింది. వన్ చైల్డ్ అనే పాలసీని తీసుకొచ్చింది. ఆ నియమాలను ఉల్లంఘించిన వారికి శిక్షలు కూడా విధించిన సందర్భాలు ఎన్నో. దీంతో చైనా ప్రజలు ఒక్కరే చాలు అన్నదానికి కట్టుబడిపోయారు. ఈ ప్రభావం చైనాపై బాగానే చూపెట్టింది. జననాలు తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగింది. దీంతో చైనా తన విధానాన్ని మార్చుకుని ‘ముగ్గురు పిల్లల్ని కనొచ్చు’ అని ప్రకటించింది. ఈ ప్రకటనతో చైనా యువత షాక్ అయ్యింది. ‘వామ్మో ఇద్దరు పిల్లల్ని కని పెంచి పోషించటమే కష్టమైపోతోంది. ముగ్గురు పిలల్ని కనాలా? మా వల్ల కాదంటోంది చైనా యువత.
చైనాలో సంతానంపై పరిమితులను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న చైనా ప్రభుత్వం..ముగ్గురు పిల్లల్ని కనొచ్చంటూ చైనా రెండు రోజుల క్రితమే ప్రకటన చేసింది. దీనికి కారణం చైనాలో యువత చాలా తక్కవైపోయారు. మరోపక్క వృద్ధులు పెరిగిపోయారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం దీని వల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళనతో ముగ్గురు పిల్లలను కనొచ్చు అని ప్రకటించింది. కానీ చైనా యువత మాత్రం దీనికి సిద్దంగా లేదు. ‘వామ్మో.. ముగ్గురు పిల్లలా?’ అంటూ భయపడిపోతోంది. ఇద్దరు పిల్లలతోనే కష్టమైపోతోంది. వారిని పెంచి చదివించటానికి నానా యాతనలు పడుతున్నాం. ఇక ముగ్గుర్ని కనాలంటే మా వల్ల కాదు అనేస్తున్నారు. ఖర్చులు భరించే పరిస్థితి మాకు లేదనీ..ముగ్గురు పిల్లల భారాన్ని భరించలేమంటున్నారు. ఇటు వర్కింగ్ టైమ్స్ మరో పక్క కుటుంబ బాధ్యతల ఒత్తిడి భరించలేమంటూ ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసలు పిల్లల్ని కనటానికి చాలామంది మహిళలు ఆసక్తి చూపించట్లేదని..యాన్ జియాకి అనే 22 ఏళ్ల యువతి తెలిపింది. ఈ పీజీ చదువుతోంది.కొంతమంది అమ్మాయిలైతే అసలు పెళ్లే చేసుకోకూడదనుకుంటున్నారని తెలిపింది.నా స్నేహితుల్లో చాలామంది వివాహం చేసుకోవటానికి ఆసక్తి చూపించట్లేదని..ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారని తెలిపింది.ఇప్పుడున్న వారికే నగరాలు సరిపోవడం లేదని, ఇంకా పిల్లల్ని కని ఎక్కడ పెట్టుకోవాలని యాంగ్ షెంగ్యీ అనే ఇద్దరు పిల్లల తండ్రి వాపోయాడు. ‘‘మా ఆదాయం అంతంత మాత్రమే. ఇద్దర్ని సాకడానికే ఆ మొత్తం చాలట్లేదు. మా నలుగురికి ఉంటున్న ఇల్లూ సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలంటే కష్టమే’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు. పనివేళలు ఎక్కువగా ఉండడం, ఇళ్లు కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా ధరలు భారీగా ఉండడం వంటి కారణాల వల్ల కొందరైతే పెళ్లిళ్లూ వద్దనుకుంటున్నారు. కాబట్టి ముగ్గురు పిల్లల్ని కనాలనే విషయం మాట్లాడొద్దని దానికి యువత ఏమాత్రం సుముఖంగా లేదని తెలిపింది.
సమస్యలు తెచ్చిపెట్టిన ఇద్దరు వద్దు ‘ఒక్కరే ముద్దు’ పాలసీ
దేశ జనాభా వేగంగా పెరిగిపోతుండడంతో చాలా ఏళ్ల క్రితం చైనా ప్రభుత్వం వన్ చైల్డ్ (ఒక్కరే) పాలసీని తీసుకొచ్చింది. ఆ నియమాలను ఉల్లంఘించిన వారికి శిక్షలూ వేసింది. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత లేదని కూడా చెప్పింది. అలా పిల్లల్ని కనే విషయంలో చైనా చాలా కఠినంగా వ్యవహరించింది. దీంతో చైనా ప్రజలు ఒక్కపిల్లే చాలు అనే దానికి కట్టుబడిపోయారు. దీని వల్ల జననాలు తక్కువైపోయి వృద్ధులు సంఖ్య పెరిగిపోయింది. దీంతో 2016లో వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసి..ఇద్దర్ని కనేందుకు అనుమతినిచ్చింది. ఇప్పుడు తాజాగా ముగ్గుర్ని కనండి అని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఎంతమందిని కనమంటే అంతమందిని కనాలా? ఠాట్ కుదరదు..ముగ్గురు కనం కనలేం అంటోంది ప్రస్తుతం చైనా యువత.ముగ్గుర్ని కనండి అని ప్రభుత్వం చేసిన ప్రకటనపై చైనా సోషల్ మీడియాలో మీమ్స్ తెగ పేలిపోతున్నాయి. ప్రభుత్వం ఠక్కున మేలుకుని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా..ఇప్పటికే లేట్ అయిపోయిందంటున్నారు.
మూడవ బిడ్డను కనే విషయంలో పలు ఏరియాల్లో మీడియా సర్వే నిర్వహించగా..ఓ వ్యక్తి మాకు అంత ఆర్థిక స్తోమత లేదు.మా ఇల్లు చాలా చిన్నది. ఇప్పటికే మాకు ఇద్దరు పిల్లలతో కష్టపడుతున్నాం. ఇక మూడవ బిడ్డ అంటే కష్టమే అని యంగ్ అనే వ్యక్తి తెలిపాడు. ఇలా పలు కారణాలతో పలువురు మూడవ బిడ్డ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
కానీ పరిస్థితి ఇలానే ఉంటే దేశ రక్షణకు అవసరమైన సైనికులూ భవిష్యత్తులో దొరకరంటూ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో దద్దుబాటు చర్యల్లో భాగంగా అత్యధిక ఆదాయం ఉన్న కుటుంబాలు ముగ్గురు పిల్లలు వరకు కనాలని సూచించింది. ఈ నెల ప్రారంభంలో వెల్లడైన జనాభా లెక్కల ప్రకారం చైనాలో గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 0.53 శాతం. 2000-2010 మధ్య ఇదే వృద్ధి రేటు 0.57 శాతం ఉంది.
2010 జనాభా లెక్కలతో పోలిస్తే చైనాలో 16 నుంచి 59 సంవత్సరాల వయసు జనాభా 4 కోట్లు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండే చైనాలో సడలింపులు ఎవరూ ఊహించనిదే. చైనాలో 2019 జనాభా లెక్కల ప్రకారం.. మొత్తం 139.77కోట్ల మంది ఉన్నారు. ఇదే సమయంలో 2019లో ఇండియాలో 136.64కోట్ల జనాభా ఉన్నారు.