Israel Palestine Conflict: దక్షిణ గాజాను వదలని ఇజ్రాయెల్.. భీకర దాడులతో పారిపోయిన 2 లక్షల మంది, స్మశాన వాటికగా మారిన అతిపెద్ద ఆసుపత్రి

అల్జజీరా నివేదిక ప్రకారం.. యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 11,200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా, హమాస్ దాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు.

Israel Palestine Conflict: దక్షిణ గాజాను వదలని ఇజ్రాయెల్.. భీకర దాడులతో పారిపోయిన 2 లక్షల మంది, స్మశాన వాటికగా మారిన అతిపెద్ద ఆసుపత్రి

దాదాపు 40 రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సాగుతోంది. అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న ఈ ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపు 12 వేలకు పైగా మరణించారు. ఇప్పటికే గాజా ఉత్తర భాగాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక ఆల్జజీరా నివేదిక ప్రకారం.. సురక్షిత ప్రాంతంగా పరిగణించబడే గాజా దక్షిణ ప్రాంతంలో కూడా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. వాస్తవానికి ఉత్తర గాజాను విడిచిపెట్టమని అక్కడి ప్రజలను ఇజ్రాయెల్ ఆదేశించింది. అయితే సురక్షిత ప్రాంతమని ఇజ్రాయెల్ చెప్తున్న దక్షిణ గాజాపై కూడా దాడులు పెంచడం చర్చనీయాంశమవుతోంది.

ఖాన్ యునిస్ ప్రాంతంలో నిరంతర దాడులు జరుగుతున్నాయట. దీని కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. గాజా ఆసుపత్రులపై ఇజ్రాయెల్ దాడులను యుద్ధ నేరాలుగా పరిశోధించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. అదే సమయంలో, పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ బుధవారంలోగా గాజాలో ఇంధనాన్ని అనుమతించకపోతే, దాని ఆపరేషన్ ఆగిపోతుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: రాజస్థాన్‭లో కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు

అక్టోబరు 7న గాజా నుంచి పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా ఘోరమైన దాడికి దిగింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అల్జజీరా నివేదిక ప్రకారం.. యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 11,200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా, హమాస్ దాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు.

10 రోజుల్లో రెండు లక్షల మందికి పైగా వలస వెళ్లారు
వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం.. యుద్ధం కారణంగా ఉత్తర గాజాలో గత 10 రోజుల్లో రెండు లక్షల మందికి పైగా ప్రజలు దక్షిణ గాజా వైపు పారిపోవలసి వచ్చిందని యునైటెడ్ నేషన్స్ హ్యుమానిటేరియన్ ఆఫీస్ (OCHA) మంగళవారం (నవంబర్ 14) పేర్కొంది. ఉత్తర గాజాలోని ఒక ఆసుపత్రి మాత్రమే రోగులకు చికిత్స చేయగలదని OCHA తెలిపింది. కొన్ని ఆసుపత్రుల చుట్టూ దాడులు జరుగుతున్నాయని, అక్కడ కరెంటు లేకపోవడం, నిత్యవసర సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో రోగులు, నవజాత శిశువులు, వైద్యులు చిక్కుకుపోయారని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఓబీసీలపై రాహుల్ మాటలు నీటి మూటలే

హమాస్ తన పోరాట యోధుల కోసం ఆసుపత్రులను ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. హమాస్ తన ప్రధాన కమాండ్ సెంటర్‌ను షిఫా హాస్పిటల్ క్రింద ఏర్పాటు చేసిందని ఇజ్రాయెల్ చెబుతోంది. అదే సమయంలో హమాస్, షిఫా హాస్పిటల్ సిబ్బంది ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించారు. బీబీసీ నివేదిక ప్రకారం.. గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రికి రక్షణ కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. గాజాలోని పౌరులను రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయాలని బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఇజ్రాయెల్‌ను కోరిన సమయంలో జో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తక్షణమే మానవతావాద విరామం కోసం ఆయన పిలుపునిచ్చారు.

గాజాలో అతిపెద్ద ఆసుపత్రి స్మశానవాటికగా మారింది
గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి దాదాపు స్మశాన వాటికగా మారిందని, లోపల వెలుపల మృతదేహాలు పేరుకుపోయి ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 170 మృతదేహాల కోసం సామూహిక సమాధిని తవ్వుతున్నట్లు గాజా నగరంలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫా నుంచి తాము తెలుసుకున్నామని బీబీసీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం లేదు: ఇజ్రాయెల్
డయాలసిస్ అవసరమయిన నెలలు నిండని శిశువులు సుమారు 45 మందికి కిడ్నీ రోగులకు విద్యుత్ సమస్యల కారణంగా సరైన చికిత్స చేయలేకపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇజ్రాయెల్ ఆసుపత్రి నుంచి గాజాకు ఇంక్యుబేటర్ల రవాణాను సమన్వయం చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ నేరుగా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం లేదని చెప్పింది. అయినప్పటికీ అల్-షిఫా, ఇతర ఆసుపత్రుల చుట్టూ దాడులు జరుగుతూనే ఉన్నాయి.