స్వదేశంలో పాక్ కు తీవ్ర వ్యతిరేకత..పీవోకేలో నిరసనలు

PoK against China : చైనాతో కలిసి భారత్‌పై కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నీలం, జీలం నదులపై చైనా సంస్థలు నిర్మిస్తున్న డ్యామ్‌లపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో చైనా, ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. డ్యామ్‌ల నిర్మాణాన్ని నిరసిస్తూ కాగడాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
నీలమ్-జీలం నదులపై
నీలమ్-జీలం నదులపై డ్యామ్‌లను నిర్మించొద్దు…తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. నదులపై ప్రాజెక్టులు నిర్మించడం వల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్యామ్‌ల నిర్మాణంతో పర్యావరణానికి భారీ నష్టం సంభవిస్తుందన్నారు. పాకిస్తాన్, చైనాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని నిరసనకారులు మండిపడుతున్నారు.
డ్యామ్‌ల నిర్మాణం ఆపేవరకు
డ్యామ్‌ల నిర్మాణం ఆపేవరకు తమ ఆందోళనకు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా పీఓకేలో 2.4 మిలియన్ల డాలర్లతో డ్యామ్‌ల నిర్మాణానికి పాకిస్తాన్ చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ముజఫరాబాద్‌లోని ఆజాద్ పట్టన్, కోహల హెడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణం చైనా చేపట్టనుంది.
చాలా చవకగా విద్యుత్
బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యూరోప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య కమర్షియల్ లింక్ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పాకిస్తాన్‌కు విద్యుత్ చాలా చవకగా లభిస్తుంది. జీలం నదిపై ఆజాద్ పట్టన్ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ప్రకటించింది.
2026 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి
ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను నివాస ప్రాంతంలో నిర్మిస్తుండడం వల్ల తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. పీవోకేలో పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.