ఇకపై రాకెట్ అక్కర్లేదు.. భూమి నుంచి అంతరిక్షంలోకి లిఫ్ట్..!

అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్రీ బిజోస్ కూడా వాషింగ్టన్ కేంద్రంగా బ్లూ ఆరిజిన్ ఏరోస్పేస్ కంపెనీని స్థాపించారు. మానవ సహిత సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ కోసం బ్లూ ఆరిజన్ అభివృద్ధి పరిచిన న్యూ షెవర్డ్ రాకెట్. స్పేస్ కేప్సూల్‌గా ఆర్నెళ్లలో మూడుసార్లు ఆకాశంలో వంద కిలోమీటర్ల హద్దును చేరి క్షేమంగా తిరిగొచ్చాయి. న్యూ షెవర్డ్ రాకెట్ కూడా ప్రయోగానంతరం భూమికి తిరిగొచ్చి నిలువుగా లాండవుతుంది. మస్క్, బిజోస్ల విజయాలు ఇస్రో ఆర్ఎల్వీపై మున్ముందు ఏ మేరకు ప్రభావం చూపుతాయో, చౌక రేట్ల పోటీని ఎదుర్కొని ఇస్రో తన విదేశీ కమర్షియల్ లాంచ్ మార్కెట్ షేర్ను ఎలా కాపాడుకుంటుందో చూడాలి. అయితే… ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లో కూడా ప్రైవేటు భాగస్వామ్యం పెరగనుండడంతో మరింత విజయవంతంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటున్నారు.
25వేల కోట్ల డాలర్లతో 1450 కొత్త ఉపగ్రహాలు :
2016-2025 మధ్యకాలంలో ప్రపంచ దేశాలు మొత్తం 1,450 కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నాయని, ఈ మార్కెట్ విలువ 25,000 కోట్ల డాలర్లని యూరో కన్సల్ట్ సంస్థ అంచనా వేసింది. అంతరిక్ష సాంకేతికత విలువ రాగల 30 ఏళ్లలో 33,900 కోట్ల డాలర్ల నుంచి 2.7 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా లెక్కగట్టింది. ఈ సాంకేతికత సృష్టి, వినియోగంలో 80 దేశాలు నిమగ్నమయ్యాయి. అంతరిక్షంలో అగ్రశ్రేణి దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్‌లోనూ ప్రైవేటు భాగస్వామ్యం పెరగనుండడంతో ప్రపంచంతో పోటీ పడేందుకు వీలు చిక్కింది.
ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న 1,950 ఉపగ్రహాల్లో 830 అమెరికాకు చెందినవైతే, 280 ఉపగ్రహాలతో చైనా, 147 ఉపగ్రహాలతో రష్యా తదుపరి స్థానాలను ఆక్రమిస్తున్నాయి. 54 ఉపగ్రహాలతో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్తో ఉపగ్రహాల ప్రయోగంలో ఆరితేరిన భారత్… చంద్ర, కుజ గ్రహాల మీదకు రోదసి నౌకలను దిగ్విజయంగా పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు చంద్రయాన్-2 నౌకను పంపడానికి ప్రయత్నించి.. త్రుటిలో విఫలమైంది. ఇస్రో 2018 ఫిబ్రవరిలో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి అనితర సాధ్య విజయం సొంతం చేసుకుంది.
నేల నుంచి నింగికి లిఫ్ట్ :
బహుళ అంతస్తుల భవనాలకు వేసే లిఫ్ట్ల్ మాదిరిగా నింగిలోకీ లిఫ్ట్లు వేయవచ్చు. ఇప్పుడు మనుషులను, సామగ్రిని కక్ష్యలోకి తీసుకెళ్లాలంటే రాకెట్‌లే శరణ్యం. వీటి బదులు నేల నుంచి నింగిలో 62,000 మైళ్ల ఎత్తు వరకు లిఫ్ట్ వేస్తే పని సులువైపోతుంది. ఈ దిశగా లిఫ్ట్ పోర్ట్, సెడ్కో కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. బిగెలో ఏరోస్పేస్, స్పేస్ ఐలండ్ గ్రూపులు అంతరిక్షంలో హోటళ్ల నిర్మాణానికీ ప్రయోగాలు చేపట్టాయి. భూమికి సమీపంలో 3,000 గ్రహశకలాలపై బంగారం, వెండి, ప్లాటినం, నికెల్, కోబాల్ట్, ఇనుము, మెగ్నీషియం వంటి విలువైన ఖనిజాలున్నాయి. కొన్ని శకలాలపై ఐసుగడ్డలూ ఉన్నాయి. ఈ నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విభజించి కుజుడి మీదకు వెళ్లి వచ్చే రాకెట్లకు ఇంధనాన్ని, గ్రహశకల తవ్వకాల్లో నిమగ్నమైన కార్మికులు పీల్చడానికి గాలి, తాగడానికి నీరూ సరఫరా చేయవచ్చు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా అంతరిక్ష ఉత్పత్తులు, సేవల వాణిజ్యీకరణకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సరికొత్త ప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పింది. అంతరిక్ష కార్యకలాపాలను వ్యాపార ప్రాతిపదికపై చేపట్టి స్థూల దేశీయోత్పత్తిని పెంచడానికి ఇస్రో వేసిన తొలి అడుగు. గడచిన మూడు దశాబ్దాలుగా మన విద్యారంగం సాఫ్ట్ వేర్‌నే దృష్టి కేంద్రీకరించింది. ఇకపై అంతరిక్ష పరిశోధనలకూ ప్రాధాన్యమివ్వడం ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు. అందుకోసం పాఠశాల స్థాయి మొదలు విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్య ప్రణాళికల్లో అంతరిక్ష శాస్త్రాన్ని ముఖ్యాంశం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధికి అవకాశాలున్నాయి.
స్పేస్ X రాకెట్‌లో ఒక టికెట్ ధర రూ.364 కోట్లు :
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష వేదికకు వెళ్లి రావడానికి ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి అనేకమంది సంపన్నులు సిద్ధంగా ఉన్నారు. స్పేస్ ఎక్స్ రాకెట్లో ఒక టికెట్ ధర 5.2 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 364 కోట్ల రూపాయలు. ప్రైవేటు వ్యోమగాములు 30 రోజులపాటు ఐఎస్ఎస్లో గడపడానికి యాత్రలు నిర్వహిస్తామని నాసా ప్రకటించింది. ప్రతి పర్యాటకుడు ఐఎస్ఎస్లో ఒక రాత్రి గడపడానికి 35,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. నాసా ప్రణాళికలో భాగంగానే స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ పైకి వెళ్లింది.
కేవలం 50 లక్షల రూపాయలతో క్యూబ్ శాట్స్ అనే మినీ ఉపగ్రహాలు నిర్మించి అంతరిక్షంలోకి ప్రయోగించాలని రష్యాలో స్టార్ట్ రాకెట్ అనే స్టార్టప్ కంపెనీ ప్రతిపాదిస్తోంది. లక్షా నలభై వేల రూపాయల రుసుముపై ఈ ఉపగ్రహాలు నింగిలో వాణిజ్య ప్రకటనలు, ప్రచార చిత్రాలను ప్రసరించగలవు. పెప్సికో పానీయం ఎడ్రెనలిన్ రష్ ప్రకటనల కోసం స్టార్ట్ రాకెట్ కంపెనీతో ఒప్పందం కుదిరింది కూడా. 2021లోనే ఈ పానీయ ప్రకటన వినీలాకాశంలో మెరవబోతోంది. ఇలా మొత్తం మీద అంతరిక్షంలో వ్యాపారాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధమైపోతున్నాయి. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలకు ప్రయోజనరమేనని భావిస్తున్నారు.