గులాబీ దళపతి కదనరంగంలోకి దిగబోతున్నారా? వ్యూహ రచన సిద్ధం?

ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు ఇవ్వడమే చూసిన నేతలు..ఇకపై కేసీఆర్‌లో స్పష్టమైన మార్పును చూడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

గులాబీ దళపతి కదనరంగంలోకి దిగబోతున్నారా? వ్యూహ రచన సిద్ధం?

Updated On : December 18, 2025 / 8:56 PM IST

KCR: గులాబీ బాస్‌ కేసీఆర్‌ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్‌కు రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తుంటి ఎముక గాయంతో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్న గులాబీ దళపతి, లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత పూర్తిగా ఫార్మ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. పార్టీ నేతలతో సమావేశాలు ఉన్నా ఫార్మ్ హౌస్‌కే నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ముందుకు విచారణకు హాజరైన కేసీఆర్..ఆ తర్వాత రెండు, మూడు సార్లు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు.

ఈ రెండేళ్లలో తెలంగాణ భవన్‌లో ఒకసారి కార్యవర్గ సమావేశం నిర్వహించగా, గత ఏప్రిల్ లో వరంగల్ లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు గులాబీ బాస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరోసారి తెలంగాణ భవన్‌కు వస్తున్నారు కేసీఆర్. ఈ నెల 21న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి కేసీఆర్ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (KCR)

గడిచిన రెండేళ్లు ఒక లెక్క అయితే..రాబోయే మూడేళ్లు మరో లెక్క అని భావిస్తున్నారట గులాబీ బాస్. రాబోయే రెండేళ్లు పూర్తిగా ఎలక్షన్‌ ఇయర్స్‌గా పనిచేయాలని నేతలకు డైరెక్షన్స్‌ ఇవ్వనున్నారట. ముందు నుంచి ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్తూ వచ్చిన కేసీఆర్..ఇప్పుడు రెండేళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై సమర శంఖం పూరించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట.

Also Read: మున్సిపల్ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ పోల్స్..! సర్కార్ రూట్ మార్చిందా? ప్లాన్ బీ రెడీ చేసిందా?

మరీ ముఖ్యంగా కృష్ణా, గోదావరీ జలాల విషయంలో కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి చెప్పడంపై కేసీఆర్ సీరియస్‌ ఉన్నారట. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే..ఇప్పటికి పాలమూరు ఎత్తిపోతల పూర్తయ్యేదని..మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగు, సాగు నీరందేదని కేసీఆర్ చెబుతున్నారు.

దీనిపై చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ.. రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దీనిపై సమావేశంలో చర్చించి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, గోదావరి, కృష్ణా జలాలపై పోరాడేందుకు..ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది.

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీ క్యాడర్‌లో కొంత నిరాశ ఏర్పడిందని కెసీఆర్ భావిస్తున్నారట. అయితే లేటెస్ట్‌గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ నేతలు, క్యాడర్‌ కొంత జోష్ వచ్చింది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసి ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. 21న తెలంగాణ భవన్‌లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారట కేసీఆర్.

అంతే కాకుండా పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడి ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు వస్తే గెలుపే లక్ష్యంగా పనిచేసేలా కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు ఇవ్వడమే చూసిన నేతలు..ఇకపై కేసీఆర్‌లో స్పష్టమైన మార్పును చూడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ బలోపేతంపై అందరి అభిప్రాయాలను కేసీఆర్ తీసుకోనున్నారట. పార్టీ సంస్థాగత నిర్మాణంపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న గులాబీ బాస్..కార్యవర్గ సమావేశంలో అందరితో చర్చించి ప్రణాళిక ప్రకటించబోతున్నారట. పార్టీని గ్రామ స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్..రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నుంచి మండల స్థాయి వరకు అన్ని కమిటీల నియామకానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించేలా నేతలకు ఆదేశాలు జారీ చేయనున్నారట కేసీఆర్.