భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు విధించిన వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎన్ఎస్ఏ అజిత్ ఢోభాల్ కీలక భేటీ
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు ప్రకటించడాన్ని ఢోభాల్ స్వాగతించారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపులుగా నిలుస్తాయని అన్నారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్ ఇవాళ రష్యా పర్యటనలో భాగంగా క్రెమ్లిన్‌లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఈ భేటీలో భద్రత, ఆర్థిక, ఇంధన సహకారం అంశాలపై ద్వైపాక్షిక చర్చలు సాగాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ దిగుమతులపై అధిక టారిఫ్‌లు విధించిన మరుసటి రోజు ఈ సమావేశం జరిగింది. బుధవారం ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసి భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధించారు. మొత్తం టారిఫ్ భారాన్ని 50 శాతానికి పెంచారు.
దీనిపై ఇప్పటికే స్పందించిన భారత్.. తమ ఇంధన వాణిజ్యం అంశం దేశ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగానే నడుస్తుందని తెలిపింది.
కాగా, రష్యాతో భారత్‌కు ఉన్న బంధాన్ని “అత్యంత ప్రత్యేకమైనది”గా ఢోభాల్ వివరించారు. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
“భారత్, రష్యా ఒక ప్రత్యేకమైన, దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగిస్తున్నాయి. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మేము అత్యంత ప్రాధాన్యతతో చూస్తున్నాం. ఉన్నతస్థాయి సమావేశాలు చాలా కీలకంగా నిలిచాయి” అని ఢోభాల్ చెప్పారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు ప్రకటించడాన్ని ఢోభాల్ స్వాగతించారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపులుగా నిలుస్తాయని అన్నారు.
“రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు రాబోతున్నారన్న సమాచారం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. తేదీలు దాదాపుగా ఖరారైనట్టే. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. శిఖరాగ్ర సమావేశాలు బాగా పనిచేస్తున్నాయి” అని ఢోభాల్ పేర్కొన్నారు.
భారతదేశం, రష్యా మధ్య రక్షణ రంగంలో సహకారం పెరుగుతూనే ఉంది. 2018లో భారత్, రష్యా నుంచి ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థకు సంబంధించి 5 స్క్వాడ్రన్ల కోసం $5.43 బిలియన్ ఒప్పందం చేసింది. ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు అందాయి.