భారత్‌తో యుద్ధాన్ని మేం మొదలుపెట్టం: పాక్ ప్రధాని

భారత్‌తో యుద్ధాన్ని మేం మొదలుపెట్టం: పాక్ ప్రధాని

Updated On : September 3, 2019 / 2:38 AM IST

కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్‌ను పూర్తిగా వదులుకోవాల్సి వస్తుందన్న పాక్.. వెనక్కుతగ్గడం లేదు. కానీ, యుద్ధానికి నో అంటుంది. 

పాక్ కేంద్ర మంత్రులతో పాటు మియాందాద్ లాంటి క్రికెటర్లూ.. యుద్ధం కావాలని జోరుమీద కనిపిస్తున్నారు. ఈ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం తాము శాంతి పక్షాన ఉన్నామంటున్నారు. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన సంచలన ప్రకటనలో పాక్ అణ్వాయుధాలను ముందుగా వాడబోదని స్పష్టం చేశారు. 

భారత్, పాక్ ఇరు దేశాల్లోనూ అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పటివరకూ నెలకొన్న పరిస్థితులు దేశాల మధ్య ఉద్రిక్తతలు తెచ్చిపెడుతున్నాయని ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాన్ని ముందుగా తామే వినియోగించబోమని పేర్కొన్నారు. లాహోర్‌లో సిక్కులను ఉద్దేశించి మాట్లాడుతూ పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

వాస్తవానికి అణ్వాయుధాలను ముందుగా వాడకపోవడం, శాంతిని కోరుకోవడం భారత విధానం. మోడీ గవర్నమెంట్ మాత్రం దూకుడుతో దేనికైనా రెడీ అంటోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ట్వీట్‌లోనూ ఇదే ఉద్దేశాన్ని వెల్లడించారు. ‘అణ్వస్త్రాలను ముందు వాడొద్దనే విధానానికి కట్టుబడే ఉన్నాం. ఇక మీదట ఇలాగే కట్టుబడి ఉండాలా అనేది ‘పరిస్థితుల’ పై ఆధారపడి ఉంటుందని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.