రష్యా ప్రధాని మంత్రి రాజీనామా

  • Published By: vamsi ,Published On : January 16, 2020 / 01:56 AM IST
రష్యా ప్రధాని మంత్రి రాజీనామా

Updated On : January 16, 2020 / 1:56 AM IST

రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌‌కు రాజీనామా సమర్పించారు. జాతిని ఉద్ధేశించి పుతిన్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ప్రధాని, మంత్రుల అధికారాలను మరింత బలోపేతం చేయాలంటూ కీలక ఉపన్యాసం చేశారు.

ఈ క్రమంలోనే మంత్రివర్గం, రాజ్యాంగంలో సంస్కరణలపై భేటీ తర్వాత మెద్వెదేవ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నూతన మంత్రివర్గం ఏర్పాటయ్యే వరకు పని చేయాలని మెద్వెదేవ్‌ మంత్రివర్గాన్ని అధ్యక్షుడు పుతిన్‌ కోరినట్లు చెబుతున్నారు. రష్యా కొత్త ప్రధానిగా మైఖైల్‌ మిషుస్తిన్‌(53) పేరును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిపాదించారు. ప్రస్తుతం మిషుస్తిన్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అధినేతగా ఉన్నారు. 

ఈ సందర్భంగా మెద్వెదేవ్‌ సేవలను పుతిన్‌ ప్రశంసించారు. మెద్వెదేవ్‌ దేశం కోసం కష్టపడ్డారంటూ పుతిన్‌ కొనియాడారు. 2012 నుంచి రష్యా ప్రధానిగా మెద్వెదేవ్ ఉన్నారు. అంతకుముందు 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షునిగా ఉన్నారు. ఇక మిషుస్తిన్ మాస్కోలో జన్మించారు. 1990లలో ఐటీ నిపుణుడిగా పని చేశారు.