Putin on Israel Palestine Conflict: ఒకవైపు ఉక్రెయిన్‭తో యుద్ధం చేస్తూనే.. గాజాపై ఇజ్రాయెల్ దాడిపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్

ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలను ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణానికి 24 గంటల్లో ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు

Putin on Israel Palestine Conflict: ఒకవైపు ఉక్రెయిన్‭తో యుద్ధం చేస్తూనే.. గాజాపై ఇజ్రాయెల్ దాడిపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్

Updated On : October 13, 2023 / 6:47 PM IST

Israel Palestine Conflict: హమాస్ రాకెట్ దాడుల తర్వాత, ఇజ్రాయెల్ వైపు నిరంతర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో గాజా నగరాన్ని చుట్టుముట్టింది. విద్యుత్, నీరు లాంటి ప్రాథమిక అవసరాల సరఫరాను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చాలా మంది పౌరుల ప్రాణనష్టానికి దారి తీస్తుందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, రక్తపాతాన్ని ఆపాలని పుతిన్ అన్నారు.

ఒకవైపు 24 ఫిబ్రవరి 2022 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. ఇదే సమయంలో గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ పుతిన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోని పది లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలను ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణానికి 24 గంటల్లో ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలోనే పుతిన్ ఇలా వ్యాఖ్యానించారు. వారం క్రితం తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకులను సమీకరించింది. గాజాను పూర్తిగా ముట్టడించింది. గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: హమాస్‭కు మద్దతిచ్చే వారికి సీఎం యోగి హెచ్చరికలు.. సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు

కాగా, పుతిన్ మాట్లాడుతూ.. నివాస ప్రాంతాల్లో భారీ ఆయుధాల వినియోగం ఇరు దేశాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. “ముఖ్యంగా పౌర మరణాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు ప్రధాన విషయం ఏమిటంటే రక్తపాతాన్ని ఆపడం” అని ఆయన అన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కారణంగా ఏర్పడిన సంక్షోభంలో అమెరికా పాత్ర ఉందని బుధవారం పుతిన్ విమర్శించారు. అమెరికా మిడిల్ ఈస్ట్ (పశ్చిమ ఆసియా) విధానాల వైఫల్యాలకు ఇది స్పష్టమైన ఉదాహరణని చాలా మంది తనతో ఏకీభవిస్తారని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.

రష్యా మీడియా ప్రకారం.. శాంతి ఒప్పందాలపై అమెరికా గుత్తాధిపత్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించిందని, అయితే దురదృష్టవశాత్తు ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఆ ఒప్పందాలను అమలు చేయడంపై దృష్టి పెట్టలేదని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలలో పేర్కొన్న వాటితో సహా పాలస్తీనా ప్రజల ప్రధాన ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ‘ఏకపక్ష పరిష్కారాన్ని’ విధించే ప్రయత్నం ఇదని ఇరువైపులా వాషింగ్టన్ ఒత్తిడి ఉందని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Assembly Elections 2023: ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వస్తున్న ఎస్సీ, ఎస్టీ బ్యూరోక్రాట్లు.. పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్

పాలస్తీనా ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను అమెరికా ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని పుతిన్ విమర్శించారు. మాస్కోలో ఇరాక్‌ ప్రధాని మహ్మద్‌ అల్‌ సుడానీతో భేటీ సందర్భంగా పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో ఇరువైపులా ఉన్న పౌరులకు హానిని తగ్గించడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా పుతిన్ నొక్కి చెప్పారు.